తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా ఆనవాయితీగా నిర్వహించే మహానాడు సమావేశాలు శుక్రవారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు తిరుపతిలో జరుగబోతున్నాయి. ఈ సమావేశాలకి రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ నేతలు, కార్యకర్తలు సుమారు 20 వేల మంది వరకు తరలివస్తున్నారు. కనుక అందుకు తగ్గట్లుగానే చాలా ఆహారం, వసతి, తదితర సౌకర్యాలు చాలా బారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
ఈ సమావేశాల ముఖ్యోదేశ్యం తెదేపా ఆత్మావలోకనం చేసుకొని, భవిష్య కార్యాచరణకి దిశా నిర్దేశం చేసుకోవడం, రెండు తెలుగు రాష్ట్రాలలో సమస్యలపై చర్చించి వాటిపై తీర్మానాలు చేయడం, విభజన తరువాత పరిస్థితుల గురించి చర్చించి, ఈ రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవిధంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేసింది వివరించి, దాని భవిష్య ప్రణాళికలను ఆవిష్కరించడం. విభజన హామీలు, తెలంగాణాలో సమస్యలు వంటి అనేక అంశాలపై ఈ మహానాడు సమావేశాలలో తీర్మానాలు చేస్తారు.
అయితే ఈ సమావేశాలలో తెదేపా నేతలు ఆత్మస్తుతి, పరనిందకే పరిమితమయ్యే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే, తెదేపా రెండేళ్ళ పాలనపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్ళయినా ఏ ఒక్క ప్రాజెక్టు పనులు కూడా మొదలవలేదు. కొన్ని హామీల అమలు విషయంలో కేంద్రం తన మాట నిలబెట్టుకోలేదు. తెలంగాణాలో తెరాస కారణంగా తెదేపా తుడిచిపెట్టుకుపోతోంది. వీటన్నిటిపై చర్చ, తీర్మానాలు చేస్తునప్పుడు సహజంగానే తెదేపా తనను తాను సమర్ధించుకొంటూ, పొగుడుకొంటూ ప్రతిపక్షాలను, తెలంగాణా ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని వేలెత్తి చూపక తప్పదు. కనుక ఈ సమావేశాలలో ఆత్మస్తుతి, పరనింద అనివార్యమవుతాయి.
కానీ ఇంత వ్యయప్రయాసలకోర్చి మహానాడు సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు, తెదేపా నేతలు ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకొని తెలంగాణాలో పార్టీ పరిస్థితి గురించి సమీక్షించుకొని, దానికి పునర్వైభవం ఏవిధంగా సాధించాలనే దానిపై లోతుగా చర్చించి తగిన ప్రణాళికలు రచించుకొంటే పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే రాజధాని నిర్మాణంతో సహా రాష్ట్రంలో పెండింగులో ఉన్న పలు ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాలను ఏవిధంగా ముందుకు తీసుకుపోవాలని గట్టిగా ఆలోచిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కానీ కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని, హామీలు అమలు చేయడం లేదని నిందిస్తూ తీర్మానాలు చేయడం వలన ఏ ప్రయోజనం ఉండదు. నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేయగలిగితేనే ఈ సమావేశాల ప్రయోజనం నెరవేరుతుంది.