తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ తెరాస. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్తున్న పార్టీ. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులను పొందిన వాళ్ల బయోడేటాను గమనిస్తే, పదమూడేళ్లుగా జెండాను మోసిన వాళ్లకు ఎంత విలువ ఉందో అర్థమవుతుంది.
కేసీఆర్ కేబినెట్లో ఉద్యమకారులు ఎందరున్నారో, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు ఎందరున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నేను తెలంగాణకు వ్యతిరేకమని తొడగొట్టి సవాల్ చేసిన వాళ్లను పిలిచి మరీ కేసీఆర్ మంత్రిపదవులు ఇచ్చారు. ఇంత కాలం పార్టీ జెండాను భుజాన మోసిన వారు, కేసులు ఎదుర్కొన్న వారికి మాత్రం కనీసం గుర్తింపు దక్కడం లేదు. జేఏసీ ద్వారా లక్షల మందిని ఏకతాటిపైకి తెచ్చిన వారికి ఎందుకు గుర్తింపు లేదని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.
తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరిన వారికి జాక్ పాట్ తగిలినట్టు కనిపిస్తోంది. తాజాగా రాజ్యసభ, మండలి అభ్యర్థిత్వాల్లోనూ అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ మంత్రి సహా అనేక పదవులను అనుభవించి, అన్ని విధాలుగా లబ్ధి పొందిన డి. శ్రీనివాస్ ను ఇటీవల పార్టీలో చేర్చుకుని, కేబినెట్ మంత్రి హోదాలో సలహాదారు పదవి ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభకు పంపుతున్నారు. డీఎస్ రెండు సార్లు పీపీసీ అధ్యక్షుడయ్యారు. టికెట్ల పంపకాల్లో కీలక పాత్రను పోషించారు. ఆయన కుమారుడికి నిజామాబాద్ మేయర్ అవకాశాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయినా పదవుల కోసం వలస వచ్చిన వ్యక్తికి ఇంతటి రాచమర్యాదలు అవసరమా అని తెరాస కేడర్ విస్తుపోతోంది.
మండలికి పంపడానికి కేసీఆర్ కు ఒక్క ఉద్యమకారుడు కూడా కనిపించలేనట్టుంది. కాంగ్రెస్ హయాంలో మంత్రి పదవిని అనుభవించిన మరో నాయకుడికి మహదవకాశం కల్పించారు. శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ వారు ఓడించారని కేసీఆర్ గగ్గోలుపెట్టారు. ఆమెను ఇప్పుడు మండలికి పంపితే ఎవరు వద్దంటారు? పోనీ తెరాసలోనే మొదటినుంచీ పనిచేస్తున్న జిల్లా, మండల స్థాయి నేత, లేదా ఒక కార్యకర్తకు అవకాశం ఇస్తే ఏమయ్యేది? జెండా మోసిన వారికి మంచి గుర్తింపు ఉంటుందని కేడర్ లో నైతిక స్థయిర్యం పెరిగేది కదా?
పార్టీకి కార్యకర్తలే బలం. కొండంత అండ. నాయకులు పదవుల కోసం పార్టీలు ఫిరాయించినా కార్యకర్తలు మాత్రం తల్లిలాంటి పార్టీనే నమ్ముకుంటారు. ఇప్పుడు బంగారు తెలంగాణ సాధన కోసం వచ్చామంటూ చిలక పలుకులు పలుకుతూ పదవుల కోసం పార్టీ ఫిరాయించిన నేతలు, రేపు తెరాస ఓడిపోతే కారులోనే ఉంటారా? కారు దిగి అధికార పార్టీలోకి జంప్ చెయ్యరని గ్యారంటీ ఉందా? కచ్చితంగా లేదు. ఈ అవకాశవాద రాజకీయ నాయకుల్లో అందరూ కాకపోయినా అత్యధికులు అధికార పార్టీ గేట్లు తెరిస్తే పొలోమని పరుగులు పెట్టడం ఖాయం.
కొన్ని దశాబ్దాలుగా పదవులు ఇచ్చిన కన్నతల్లి లాంటి పార్టీనే కాదనుకున్న వారు, మధ్యలో వచ్చిన వాళ్లు తెరాసకు జీవితాంతం విదేయులై ఉంటారనే గ్యారంటీ ఏమీ లేదు. మనం కోరుకోవడం కాదుగానీ, పార్టీలో ఏదైనా సంక్షోభం వస్తే అండగా ఉండేది కార్యకర్తలే. కేడర్ ను నమ్ముకున్న పార్టీ ఏదీ చెడిపోలేదు. స్వార్థం కోసం, పదవీ లాలసతో చేరే వారికి పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టడం ద్వారా కేసీఆర్ తన కేడర్ కు ఏ సందేశం ఇస్తున్నారో అర్థం కాదు. జెండా మోయడం దండగ అనా? పార్టీకి, ఉద్యమానికి, తెలంగాణ తల్లికి విధేయంగా ఉండటం నేరం ఘోరం అనా? ఇదే ఇప్పుడు తెలంగాణ వాదులు అడుగుతున్న ప్రశ్న. మరి
జవాబు చెప్పేదెవరు?