తెలంగాణా సాధన కోసం జరిగిన ఉద్యమాలలో ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో తెలంగాణా రాజకీయ జె.ఏ.సి.పోషించిన కీలక పాత్ర గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తెరాస ప్రభుత్వం ఆయనని తగిన విధంగా గౌరవిస్తుందని అందరూ భావిస్తే, అసలు ఆయనను, రాజకీయ జె.ఏ.సి.ని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోనేలేదు. అనేక విషయాలలో ప్రభుత్వానికి ఆయన చేసిన సూచనలను సైతం పట్టించుకోలేదు. అయినా ప్రొఫెసర్ కోదండరామ్ నిరుత్సాహపడకుండా, ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
ఆయన ఈ మద్యన కొన్ని రోజులు విదేశీ పర్యటన చేసినపుడు ప్రవాస తెలంగాణా ప్రజలు ఆయనకి అనేక సలహాలు, సూచనలు చేశారు. ఆయన హైదరాబాద్ తిరిగివచ్చిన తరువాత జె.ఏ.సి.లో నేతలతో ఆ విషయాలన్నీ మాట్లాడినప్పుడు, రాజకీయ జె.ఏ.సి. ఆశయసాధన కోసం రాజకీయ పార్టీగా మార్చి, ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని ప్రవాస తెలంగాణా ప్రజలు చాలా మంది తనను కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలన్నీ దాదాపు నిర్వీర్యం అయిపోయాయి కనుక తెలంగాణ రాజకీయ జెఎసి వాటి స్థానం తీసుకొని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించాలని చాలా మంది కోరినట్లు ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. ఆయన సూచనపై సభ్యుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. అది చాలా మంచి ఆలోచనేనని కొందరు భావించగా, ఆచరణలో అది చాలా కష్టం కనుక అటువంటి ఆలోచనలు చేయకుండా ప్రస్తుత పంధాలోనే ముందుకు సాగడం అందరికీ శ్రేయస్కరం అని మరికొందరు చెప్పినట్లు తెలుస్తోంది.
ఒకవేళ రాజకీయ జె.ఏ.సి. రాజకీయ పార్టీగా అవతరించి, ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినట్లయితే అది శుభ పరిణామమే. కానీ తెరాస ధాటికి కొమ్ములు తిరిగిన కాంగ్రెస్, తెదేపా, భాజపాలే నిలవలేక విలవిలలాడుతున్నప్పుడు, ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస ధాటికి తట్టుకొని రాజకీయ జె.ఏ.సి.ని ప్రత్యామ్నాయ శక్తిగా మలచగలరా అనే అనుమానం కలుగుతోంది.