త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అ.ఆ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఇదో లేడీ ఓరియెంటెడ్ సినిమా అనీ, ఈ సినిమాలో నితిన్ కంటే సమంత క్యారెక్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉందని.. ఆమె పాత్ర ముందు నితిన్ తేలిపోయాడని రకరకాల ఊహాగానాలు. వీటికి తెరదించే ప్రయత్నం చేశాడు నితిన్. అ.ఆలో ఎవరి ప్రాధాన్యం ఏమిటి? అని అడిగితే.. ఇదో ప్రేమకథ అనీ, ప్రేమకథల్లో ఎవరి పాత్ర ఎక్కువ, ఎవరి పాత్ర తక్కువ అనేది చూడకూడదని చెబుతున్నాడు. ఈ సినిమా ప్రధానంగా ఎనిమిది పాత్రల చుట్టూ నడుస్తోందట. ఆ ఎనిమిది పాత్రలూ కీలకమే అంటున్నాడు నితిన్.
అన్నట్టు ఈ సినిమాలో నితిన్ ఓ చెఫ్‌గా కనిపిస్తున్నాడు. ఇలాంటి పాత్ర చేయడం తనకు చాలా కొత్తగా ఉందని, తాను ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో నటుడిగా సంతృప్తినిచ్చింది ఇదే అంటున్నాడు. త్రివిక్రమ్‌ని ఓ దర్శకుడిగా చూళ్లేదట. ఓ గురువుగా చూశాడట. తన జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకొన్నా.. వెంటనే త్రివిక్రమ్ దగ్గరకు వాలిపోతానని, ఆయన సలహా తీసుకొంటాననీ అంటున్నాడు. అంతా ప్రభావితం చేశాడన్నమాట ఆ మాటల మాంత్రికుడు.