మళ్ళీ చాలా రోజుల తరువాత ప్రధాని నరేంద్ర మోడి నోటంట పాకిస్తాన్ ప్రసక్తి వచ్చింది. “భారత్, పాకిస్తాన్ చేతులు కలిపితే చాలా ప్రగతి సాధించవచ్చు. కానీ దానికి ఉగ్రవాదం ఒక ప్రధాన అవరోధంగా ఉంది. ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు బలపడటానికి భారత్ చొరవ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ పాకిస్తాన్ ఆ అవరోధం తొలగించుకోగలిగితేనే అది సాధ్యం అవుతుంది. నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడే ఇరుగు పొరుగు దేశాలన్నిటికీ స్నేహ హస్తం అందించేను. కేవలం ఉగ్రవాదం కారణంగానే పాక్ తో దూరంగా ఉండిపోవలసివస్తోంది. నేను నా దేశం ఏవిధంగా గొప్పగా అభివృద్ధి సాధించాలని కోరుకొంటున్నానో, అలాగే నా ఇరుగు పొరుగు దేశాలు కూడా అభివృద్ధి సాధించాలని కోరుకొంటున్నాను,” అని మోడీ వాల్ స్ట్రీట్ జనరల్ పత్రికకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
చైనా గురించి కూడా ఆయన చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నిజమే! చైనాతో గత మూడు దశాబ్దాలుగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. కానీ ఏనాడూ సరిహద్దుల వద్ద ఒక్క బులెట్ కూడా ప్రేలలేదు. ఎటువంటి ఘర్షణలు జరుగలేదు. రెండు దేశాల మధ్య క్రమంగా వ్యాపారం పెరుగుతోంది. ఇరు దేశాల ప్రజల మధ్య మంచి బలమైన సంబంధాలు ఏర్పడుతున్నాయి. కనుక చైనా పట్ల మా విదేశీ విధానం గురించి పునరాలోచించనవసరం లేదు,” అని అన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో దూసుకొనిపోతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ విజయావకాశాలు మెరుగవడంతో, ప్రధాని నరేంద్ర మోడి అమెరికాతో సంబంధాల గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడారు. “భారత్-అమెరికా సంబంధాలు ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎప్పుడూ బలంగానే ఉన్నాయి. రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్నా డెమోక్రట్లు అధికారంలో ఉన్న మా సంబంధాలలో ఎటువంటి మార్పులు లేకుండా నిలకడగా సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, నా ఆలోచనలు చాలా కలవడంతో మా మధ్య చక్కటి స్నేహం ఏర్పడింది. ఆ కారణంగానే గత ఏడాది కాలంలో ఇద్దరం కలిసి అనేక విషయాలలో ముందడుగు వేయగలిగాము,” అని అన్నారు.
చైనాతో సరిహద్దు సమస్య ఉన్నప్పటికీ భారత్-చైనా దళాలు ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకొనే పరిస్థితి ఎన్నడూ ఏర్పడలేదు. అందుకు కారణం ఇరు దేశాల నేతలు విజ్ఞత, సంయమనం ప్రదర్శించడమే. కానీ పాకిస్తాన్ తో స్నేహం కోసం భారత్ ఎన్నిసార్లు ప్రయత్నించినా అవి ఏదో ఒక స్థాయిలో విఫలం అవుతూనే ఉన్నాయి. అందుకు పాకిస్తాన్నే నిందించక తప్పదు.
భారత్-పాక్ సంబంధాల విషయంలోనే కాదు..దాని అంతర్గత సమస్యలకి దానిని అదే నిందించుకోవలసి ఉంటుంది. భారత్, పాక్ రెండు దేశాలకి ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, పాక్ పాలకుల లోపభూయిష్టమైన విధానాల వలననే ఆ దేశం నేటికీ అభివృద్ధికి నోచుకోలేదు. ఆ కారణంగానే దేశంలో నిరుద్యోగం, అశాంతి నెలకొని ఉంది. ఆ సమస్యలను పరిష్కరించలేని పాక్ పాలకులు, ప్రజల దృష్టిని మళ్ళించేందుకే భారత్ ని బూచిగా చూపిస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు. దాని వలన ఆ దేశమే చాలా నష్టపోతున్నప్పటికీ ఆ పరిస్థితిలో మార్పు తేగల మంచి నాయకుడు లేకపోవడంతో భారత్ పట్ల పాక్ పాలకులు అదే వైఖరిని అవలంభించవలసి వస్తోంది. కనుక అది ఉగ్రవాదాన్ని కూడా ఎన్నటికీ వదిలించుకోలేకపోవచ్చు. కనుక భారత్-పాక్ సంబంధాలు ఎప్పటికీ ఇదేవిధంగా మూడడుగులు ముందుకి ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా సాగవచ్చు.