తన తొలి చిత్రం అఖిల్ సినిమా దెబ్బ.. అఖిల్‌కి ఎంత తగిలిందో.. నితిన్‌కీ అంతే తగిలింది. టాప్ ప్రొడ్యూసర్స్ అఖిల్ డెబ్యూ మూవీని తీయాలని ప్లాన్ చేస్తే ఆ ఛాన్స్ నితిన్ చేతికి చిక్కింది. తన వంతుగా ఓ మంచి సినిమాని తీయాలని, స్నేహితుడికి ఓ హిట్ ఇవ్వాలని నితిన్ కూడా ప్రయత్నించాడు. కానీ… అఖిల్ డిజాస్టర్‌తో నితిన్‌కీ గట్టి షాక్ తగిలింది. ఆ సినిమా ఆర్థికంగా చేసిన నష్టం కంటే, మానసికంగా ఇచ్చిన షాకే ఎక్కువని చెబుతున్నాడు నితిన్. ఆ ఫ్లాప్ నుంచి తేరుకోవడానికి చాలాకాలం పట్టిందట. అఖిల్ ఫ్లాప్ అయిన రెండు మూడు నెలల వరకూ రాత్రిళ్లు నిద్రకూడా పోలేదట.
కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి.. డబ్బులు పోతాయి. కానీ అఖిల్ ఇచ్చిన స్ట్రోక్ వేరు.. అంటున్నాడు నితిన్. స్నేహితుడికి హిట్ సినిమా ఇవ్వలేకపోయాన్న బాధ తనని ఇంకా వెంటాడుతూనే ఉందట. అయితే ఆ ఫ్లాప్ వల్ల తమ స్నేహానికి ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదని, ఇప్పటికీ తాము మంచి ఫ్రెండ్సని చెబుతున్నాడు నితిన్. మరి స్నేహితుడు కోసం నితిన్ మళ్లీ నిర్మాతగా అవతారం ఎత్తి.. ఈ లోటుని భర్తీ చేస్తాడేమో చూడాలి.