కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతి హస్సన్ జంటగా నటించిన శ్రీమంతుడు సినిమా ఈరోజు విడుదలయ్యింది. సినిమా విడుదలకు ముందే మంచి పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకొంది. కనుక ఈ సినిమాపై చాలా భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఆ సినిమా మొట్టమొదటి షో ఇంకా నడుస్తోంది. ఆ సినిమా తాలూకు కొన్ని దృశ్యాలు అప్పుడే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమవుతున్నాయి. తక్షణమే స్పందించిన ఆ సినిమా నిర్మాతలు హైకోర్టుని ఆశ్రయించారు.
ఆ సినిమా కాపీ రైట్ హక్కులు ఉల్లంఘన జరగకుండా తాము సివిల్ కోర్టు నుండి ఆదేశాలు పొందామని, ఇప్పుడు ఇంటర్నెట్ లో తమ సినిమా దృశ్యాలను ప్రదర్శించడం వలన తమ కాపీ రైట్ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని కనుక దానిని తక్షణమే అడ్డుకొనేందుకు కేంద్ర ఐటి. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వవలసినదిగా నిర్మాతల తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టుని కోరారు. దానిపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్ ఇంటర్నెట్ లో వస్తున్న ఆ సినిమా దృశ్యాలను నిలిపివేయమని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించమని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. అదే విధంగా సినిమా దృశ్యాలు ఇంటర్నెట్ లో ప్రసారం కాకుండా చూడాలని రెండు రాష్ట్రాల డి.జి.పిలను ఆదేశించారు.