కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం వెనుక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెదేపా నేతలు పదేపదే ఆరోపిస్తుండటం, దానిని నిరూపించమని ఆయన సవాలు విసురుతుండటం అందరికీ తెలిసిన విషయమే. వారి వాదోపవాదాల వలన అసలు సమస్య పక్కదారిపట్టి, ఆయన వెనుక జగన్ ఉన్నారా లేదా అనే దానిపై చర్చ మొదలయింది. ఆ విషయం ఆయన కూడా గ్రహించినట్లే ఉన్నారు అందుకే ఆయన అన్ని వర్గాల, పార్టీల నేతలని వరుసగా కలుస్తూ తన పోరాటానికి మద్దతు కోరుతున్నారు. మొన్న మాజీ ఎంపి హర్ష కుమార్ ని కలిసి వచ్చారు. మళ్ళీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరబోతున్నారు. ఆ తరువాత భాజపా నేతలని కూడా కలుస్తారేమో తెలియదు కానీ అందరి మద్దతు పొందడం వలన తన ఉద్యమానికి బలం చేకూరడమే కాకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ ఉద్యమం నడిపిస్తున్నాననే అపవాదు తొలగించుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లున్నారు. అది చాలా మంచి ఆలోచనే అని చెప్పవచ్చు. ప్రతిపక్ష పార్టీలు సహజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటాయి కనుక, ఒకవేళ అవన్నీ ఆయనకు మద్దతు ఇచ్చినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతుంది కనుక అప్పుడు ప్రభుత్వం ఆయన గురించి ఇంత తేలికగా మాట్లాడలేదు. ముద్రగడ పద్మనాభం ఇదే పని మొదటే చేసి ఉండి ఉంటే, నేడు ఆయన పోరాటం, దాని ఫలితాలు కూడా మరో విధంగా ఉండేవేమో?