చిరంజీవి 150వ సినిమా కథ కోసం ఎన్ని పడిగాపులు పడ్డారో? సరైన కథ దొరకలేదు, దొరకలేదు అంటూ యేళ్లకు యేళ్లు కాలయాపన చేశారు. ఓ దశలో రామ్‌చరణ్ అయితే.. ‘డాడీకి సరిపడా కథ తీసుకొస్తే కోటి రూపాయలిస్తా’ అనేశాడు కూడా. చివరికి తమిళ సినిమా కత్తిని రీమేక్ చేయాలని నిర్ణయించుకొన్నారు. దాన్ని చిరు శైలికి మార్చుకొంటున్నారు కూడా. ఇంతకీ ఈ కథ విలువెంతో తెలుసా? ఇప్పుడు రూ.20 లక్షలు మాత్రమే. కత్తి కథపై వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఈ కథ మురుగదాస్ పేరుమీద చలామణీ అవుతోంది. అయితే కత్తి కథ నాదే అని తెలుగు రచయిత నరసింహారావు కొంతకాలంగా పోరాటం సాగిస్తున్నాడు. తమిళ రచయితల సంఘం, దర్శకుల సంఘం ఈ వివాదం లేల్చలేక చేతులెత్తేసింది. దాంతో నరసింహారావు కూడా ఆశలు వదులుకొన్నాడు.
అయితే చిరంజీవి తన 150వ చిత్రం కోసం కత్తిని రీమేక్ చేస్తున్నాడనగానే నరసింహారావు మేల్కొన్నాడు. మళ్లీ పాత ఫైలు తిరగేశాడు. దాంతో చిరు సినిమా మొదలవ్వడానికీ ఆటంకం కలిగింది. ఈ వివాదంలో తెలుగు దర్శక నిర్మాతలకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఆ ప్రభావం మాత్రం పడింది. ఈ విషయం తేల్చుకోలేకపోతే ఎప్పటికైనా ఇబ్బందే అని భావించిన చిరు.. ఈ సమస్యను వెంటనే తేల్చమని తమిళ నిర్మాతల్ని కోరాడట. వాళ్లు ఇప్పుడు సెటిల్‌మెంట్ చేసేసుకొన్నారని టాక్. రూ.20 లక్షలు ఇచ్చి.. కామ్‌గా సంతకాలు పెట్టించుకొన్నారని, ఇక ఈ వివాదం ముగిసినట్టేనని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇంత కాలంగా ఓ రచయిత సాగించిన ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయన్నమాట.