కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ఇటీవల కొంత కాలంగా అనేక వివాదాలలో చిక్కుకోవడం, బెంగళూరు నగరంలోనే శాంతి భద్రతల సమస్యలను అదుపు చేయడంలో విఫలంకావడం వంటి అనేక కారణాల చేత కాంగ్రెస్ అధిష్టానం ఆయనను తొలగించి, ఆయన స్థానంలో లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గేని నియమించవచ్చని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన పదవికి ఇప్పుడేమీ డోకా లేదని తాజా సమాచారం.
ప్రస్తుత పరిస్థితులలో ఆయనను తొలగిస్తే, ఆయన కొంత మంది ఎమ్మెల్యేల మద్దతుతో పార్టీని చీల్చి, ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చనే సమాచారం అందడంతో, ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తాజా సమాచారం. కానీ పిసిసి అధ్యక్షుడిని, కొందరు మంత్రులను మార్చాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ద రామయ్య, పిసిసి అధ్యక్షుడు పరమేశ్వర ఇరువురూ కూడా బలహీన వర్గాలకు చెందినవారు కనుక, పిసిసి అధ్యక్షుడుగా అగ్రకులాలకు చెందిన లింగాయత్ కులస్తుడిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో రాజ్యసభ, విధాన పరిషత్ ఎన్నికలు పూర్తయిన తరువాత ఆ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవి పూర్తయిన తరువాత ముఖ్యమంత్రి సిద్ద రామయ్య డిల్లీ వెళ్లి ఈ మార్పులు చేర్పుల గురించి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకొంటారని సమాచారం.
కాంగ్రెస్ అధిష్టానం మొదట సిద్ద రామయ్యని మార్చాలని ఆలోచించినప్పటికీ ఉత్తరాఖండ్ లోని చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆయననే కొనసాగించాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ఇంక, కర్నాటక భాజపా అధ్యక్షుడుగా మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్పనే నియమించబడటం, ఆయన లింగాయత్ కులానికి చెందినవారవడం చేత, కాంగ్రెస్ అధిష్టానం పిసిసి అధ్యక్షు పదవికి అదే కులానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయడం మంచిదని భావిస్తోంది. ఒకవేళ అది ముఖ్యమంత్రిని మార్చాలని ప్రయత్నించినట్లయితే, అటువంటి అవకాశం కోసమే ఆశగా ఎదురుచూస్తున్న ఎడ్యూరప్ప దానిని సద్వినియోగపరుచుకొని సిద్ద రామయ్యకి మద్దతు పలికి ప్రభుత్వాన్ని కూల్చడానికి వెనుకాడకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గాత కలహాలు, అసమ్మతి కారణంగా కర్నాటకలో అధికారం చేజార్చుకొంటే, మళ్ళీ దానికి మరో అవకాశం రావడానికి కొన్ని దశాబ్దాలు నిరీక్షించవలసి రావచ్చు. కనుకనే కాంగ్రెస్ అధిష్టానం చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకొంటున్నట్లు భావించవచ్చు.