తెదేపా ప్రభుత్వంపై వైకాపా మరో తీవ్ర ఆరోపణ చేసింది. గుంటూరులోని అమరావతి దేవాలయానికి చెందిన సదావర్తి సత్రానికి చెన్నై సమీపంలో మహాబలిపురం సమీపంలో రూ. 1,000 కోట్లు విలువ చేసే భూములున్నాయి. అవి కబ్జాకి గురవుతున్నాయనే సాకుతో వాటిని వేలం వేసి అమ్మివేయమని తెదేపా ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. ఆ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించడంతో ఆ భూములను రహస్యంగా వేలం వేసి కాపు కార్పోరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య, మరికొందరు తెదేపా నేతలు కలిసి రూ. 1,000 కోట్లు విలువ చేసే భూములను కేవలం 22 కోట్లకే స్వంతం చేసుకొన్నారని ఈరోజు సాక్షిలో ఒక కధనం ప్రచురించింది. అక్కడ ఎకరం ధర సుమారు రూ.18 కోట్లు ఉంటే, దానిని మొదట రూ.50 లక్షలుగా నిర్ణయించి, ఆ తరువాత అది అంత ధరకి అమ్ముడుపోవడం లేదని తెదేపా నేతలు చెప్పడంతో దాని ధరను రూ.27లక్షలకి తగ్గించి సుమారు 83.11 ఎకరాలను కేవలం రూ. 22 కోట్లకే చలమలశెట్టి రామానుజయ్య, మరికొందరు తెదేపా నేతలకి దేవాదాయ శాఖ కట్టబెట్టేసిందని సాక్షి పేర్కొంది. ఈ మొత్తం వ్యవహరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిసే ఆయన అంగీకారంతోనే జరిగిందని పేర్కొంది. ఇందులో తెదేపాకి చెందిన అనేకమంది పెద్దలు వాటాలు పంచుకొన్నారని సాక్షి కధనంలో పేర్కొంది. దేవాదాయ శాఖ లేదా వేరే ప్రభుత్వ శాఖలు ఏవైన ఇటువంటి వ్యవహారాలను సాధారణంగా ఈ-వేలం ద్వారానే నిర్వహిస్తుంటాయి. కానీ సదావర్తి సత్రం భూములు వేలం గురించి మూడో కంటికి తెలియకుండా జరిగిపోయిందని పేర్కొంది. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా జరుగుతున్న కుంభకోణాలలో ఇది కూడా ఒకటని పేర్కొంది. తెదేపా నేతలు అందరూ ప్రస్తుతం మహానాడు హడావుడిలో ఉన్నారు కనుక ఇంకా దీనిపై స్పందించలేదు. వారు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.