తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో నెంబర్: 1 ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇటీవల ఇండియా టుడే న్యూస్ ఏజన్సీ దేశ వ్యాప్తంగా చేపట్టిన ఒక సర్వేలో కేసీఆర్ పరిపాలనపై 86శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయగా, ఆ తరువాత స్థానాలలో వరుసగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివారాజ్ సింగ్ చవాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన పట్ల రాష్ట్రంలో 69 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. అంటే ఆయన నాల్గవ స్థానంలో ఉన్నట్లు తేలింది.
మొన్న విజయవాడలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు సంతృప్తి చెందినప్పుడే ప్రభుత్వానికి ప్రజల ఆదరణ ఉన్నట్లు భావించాలని, కనుక అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి సమిష్టి కృషి చేసి ప్రజల సంతృప్తి స్థాయి 80 శాతం చేరుకొనే విధంగా కష్టపడాలని అన్నారు. తాజా సర్వేలో రాష్ట్రంలో 69 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తేలింది కనుక సంతోషపడవలసిన విషయమే. ఆ లెక్కన చూస్తే చంద్రబాబు నాయుడు చెప్పిన 80శాతం కంటే కేసీఆర్ మరో 6 శాతం ఎక్కువే ప్రజాదారణ పొందగలిగారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రానికి కేసీఆర్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఎంతో అనుభవం, అవగాహన, పరిపాలనా దక్షత కలిగిన వ్యక్తిలా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆయన ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను దేశంలో చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలుచేయడానికి సిద్దం అవుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన పరిపాలన తీరును, ప్రాజెక్టులను మెచ్చుకొంటోంది. తెలంగాణాలో అభివృద్ధికి అవకాశం ఉంది..జరుగుతోంది కనుకనే యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ వంటి పెద్ద పెద్ద సంస్థలు తరలివస్తున్నాయి. కనుక ఈ సర్వేలు, ప్రశంసల కంటే రాష్ట్రానికి అటువంటి పెద్ద సంస్థలు తరలివస్తుండటమే ఆయన సుపరిపాలనకు, అభివృద్ధికి గీటురాయిగా చెప్పుకోవచ్చు.