ఎన్టీఆర్ ఇడ్లీ వడ్డించిన వేళ అంటూ జనవరి 25న కొన్ని విషయాలు రాశాను. విశ్వామిత్ర చిత్ర ప్రదర్శన, తర్వాత మీడియా గోష్టి దగ్గర అది ఆగింది. మరోసారి ఇడ్లీ ఎప్పుడు వడ్డించారన్న తదుపరి భాగం ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా…
……… ………
విశ్వామిత్ర చిత్ర ప్రదర్శన తర్వాత గ్రీన్లాండ్స్ గెస్ట్‌హౌస్‌లో భోజనం, పత్రికాగోష్టి.. అప్పటికింకా టీవీ ఛానళ్లు కేమెరాల హడావుడి లేదు. భోజనానికి ముందు అప్పటి పి.ఉపేంద్ర ఎన్టీఆర్‌ను సత్కరించారు. దండలు వేసి శాలువా కప్పబోతుంటే ‘ చాలా భారాలు పెడుతున్నారు’ అని ఎన్టీఆర్ ఒకింత భావయుక్తంగా అన్నారు. ఎన్టీఆర్ ఆమోదం కోసం ముందుగా సంప్రదించకుండా ఏకపక్షంగా ఉపేంద్రను విపిసింగ్ మంత్రివర్గంలోకి తీసుకున్నారనేది వాస్తవం. ఇందుకోసం లౌక్యంగా విపిసింగ్ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్లందరినీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నానని చెప్పారు. తెలుగుదేశం తరపున ఉపేంద్ర ఎలాగూ ఆ పదవిలో వున్నారు గనక తనకూ వస్తుందని అంతరార్థం. అయితే ఆ సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో వుండగా ఆయన ఢిల్లీలో సమాచార పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా చక్రం తిప్పారు. ఎన్టీఆర్‌కు ఆయనపై అప్పటికే వైముఖ్యం పెరుగుతున్నది. ఉత్తరోత్తరా తొలగించబోతున్నారు. మీరు చాలా భారాలు పెడుతున్నారు అని ఆయన అన్నప్పుడు అందులోనూ ఆర్ద్రతకన్నా అయిష్టతే వుందని అక్కడున్నవాళ్లం అనుకున్నాం. అందుకోసమే ఉపేంద్ర ఎక్కువ మర్యాద చేస్తున్నట్టు కూడా కనిపించింది.
భోజనాల అనంతరం అక్కడ ఆరుబయిట చెట్టుకింద పత్రికా గోష్టిలో ఎన్టీఆర్ విశ్వామిత్ర చిత్రం గురించి ఏకధాటిగా మాట్లాడారు. ఇంతబాగా వస్తుందని ఆవేశపూరితంగా వుంటుందని అనుకోలేదని చూసిన వారు అంటున్నారని చెప్పారు. దీన్ని తమిళంలోనూ విడుదల చేయడానికి కరుణానిధి ద్వారా ప్రయత్నాలు జరిగాయని వారు కూడా చాలా బాగా స్పందించారని తెలిపారు. థియేటర్లో చూసినప్పుడు కలిగిన అనుభవానికి ఆయన మాటలకు ఏ మాత్రం పొంతన లేకున్నా పెద్దాయన ముందు ఎవరూ మాట్లాడలేదు. ఏవో ఇతర ప్రశ్నలు వేస్తున్నారు. ఇంతలో ఒక మహిళా జర్నలిస్టు మేనకతో నటించిన సన్నివేశాలు అంత బాగాలేవన్నట్టు సూచనగా అన్నారు. వెంటనే ఆయనకు చాలా కోపం వచ్చింది. విసుగ్గా స్పందించారు. మహిళలను గౌరవించడమంటే ఏం తెలుసు? విశ్వామిత్రుడు రాజరికం వదలిపెట్టి తపోదీక్ష స్వీకరించాలని అక్కడికక్కడే నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తల్లికి ఎలా చెప్పాలని పిల్లలు అడిగితే ‘నాతో నూర్గురు సంతానాన్నికన్నది. వారికి మా పోకడలు అవగతమేలే..మీరు చెప్పేదేమిటి?’ అంటాడు. అది స్త్రీని గౌరవించడమంటే.. అని ఏదో వివరణ ఇచ్చారు. ఆ కోపం చూసిన తర్వాత అడగాలనుకున్నవారు కూడా వెనక్కు తగ్గారు. తర్వాత ఆ చిత్రం విడుదలై ఘోర పరాజయం పాలైంది.
ఎన్టీఆర్‌లా పౌరాణికాల్లో మెప్పించిన వారు మరిలేరు .కాని అంతటి మహానటుడు కూడా ఆఖరి దశలో తీసిన చాలా పౌరాణికాలు నాసిరకంగా తయారైనాయి. తను గొప్పగా వేసిన పాత్రలను తనే తక్కువస్థాయిలో తీసి దెబ్బతిన్నారు. వాటిలో శ్రీరామపట్టాభిషేకం, శ్రీమద్విరాట పర్వం,వెంకటేశ్వర కళ్యాణం వంటివి చెప్పుకోవచ్చు. ఇక చాణక్య చంద్రగుప్తు గురించి బాలకృష్ణ స్వయంగా వ్యాఖ్యానించారు. అలాటిదే సమ్రాట్ అశోక కూడా. దీన్ని బాలయ్య మరింతగా విమర్శించారు. అది వేరే కథ.
……… ……
ఈ పరాజయాల తర్వాత మోహన్‌బాబు తీసిన మేజర్ చంద్రకాంత్ ఆయనకు ఆఖరి విజయం, చిత్రం కూడా. ఆ వేడుకల్లోనే ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటానని ప్రకటించడంతో గందరగోళం రేగింది. దానిపై చాలా కథలూ వివాదాలూ…అయితే ఒకమాట నిజం. 1994లో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి లక్ష్మీ పార్వతితోనే వచ్చారు. కేకలు వేయించారు. తర్వాత విమర్శించిన చాలా మంది అప్పట్లో వారిద్దరూ ప్రచారానికి రావాలని కోరుకునేవారు. తను మాట్లాడాక ఎన్టీఆర్ .’మరదలు మాట్లాడమంటున్నారు’ అంటూ ఆమెకు అవకాశమిచ్చేవారు. ఆ ఎన్నికల ఘన విజయం మరోచరిత్ర. అయితే అప్పటికే ఎన్టీఆర్ జీవిత చిత్రం మాత్రం మారడానికి బీజాలు పడ్డాయి.
మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత ఆమె విజయవాడకు వచ్చారు. విలేకరులు కలసి మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు మంత్రివర్గంలో ప్రాధాన్యత గురించి అడిగితే ‘రెండు శాఖలు ఇచ్చాం. ఆర్థిక పంచాయితీలు ఇచ్చాం’ అన్నారు. తను అలా అనలేదని ఈనాడు కావాలని రాసిందని లక్ష్మీ పార్వతి ఇప్పటికీ చెబుతుంటారు. కాని అన్నారు. నిజానికి ఆ మాటల వెనక రాజకీయ వివాదాన్ని పసిగట్టింది ప్రజాశక్తి విలేకరి. అతనిప్పుడు ప్రముఖ టివిలో పనిచేస్తున్నాడు. విలేకరులు పరస్పరం మాట్లాడుకుంటారు గనక ఇతరులతోనూ పంచుకున్నాడు. మొత్తంమీద రెండు మూడు పత్రికలే ఈ వార్త ఇవ్వగలిగాయి. మంత్రి పదవి ఇచ్చాం అనడం ద్వారా ఆమె ఎన్టీఆర్‌తో సమానమైనట్టు మాట్లాడారని దుమారం రేగింది. తమాషా ఏమంటే తర్వాత ఆమెతో కలసి కొంత దూరం నడిచిన డా.దగ్గుబాటివెంకటేశ్వరరావు ఈ మాటలను మొదటగా ఖండించారు.చంద్రబాబు నాయుడు ఆమెకంటే చాలా సీనియర్ అయితే కొత్తగా వచ్చిన వ్యక్తి తాను మంత్రిపదవి ఇచ్చామని అనడం సరికాదని వ్యాఖ్యానించారు. షరామామూలుగా ఆమె మాత్రం ఇదంతా కుట్ర కావాలని చేస్తున్న దుష్ప్రచారం అని ప్రకటన చేశారు. ఎన్టీఆర్ మొదట ఈ విషయాలపై పెద్దగా పట్టించుకునే వారు కాదు.
……….
తర్వత కొన్నాళ్లకు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అధికార నివాసంలో ఎడిటర్లకు విందు ఇచ్చారు. నేను విజయవాడ నుంచి వచ్చి పాల్గొన్నాను. రమణాచారి స్వాగతం పలికి తీసుకెళ్లారు. అప్పటికే ఐ.వెంకట్రావ్, కొందరు హిందీ పత్రికల సంపాదకులు అక్కడున్నారు.ఎన్టీఆర్ బచావత్ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం ప్రాజెక్టులు ఎలా కట్టాలనుకుంటున్నది చెబుతున్నారు. బచావత్ ట్రిబ్యునల్ పేరిట పాత్రికేయుల జీతాలకు సంబందించింది ఒకటుంది. మాకు అది గుర్తువస్తుందని ఇతరులు అంటుండగా రామోజీ రావు గారు వచ్చారు. ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేశారు. కాస్సేపయ్యాక పైకి తీసుకెళ్లారు.
ఎన్టీఆర్ ఒక్కరే ఒకవైపున కూచోగా ఎడిటర్లందరూ ఆయనకు అభిముఖంగా కూచున్నారు. నేను వెళ్లేసరికి రామోజీ రావు పక్కన సీటు ఖాళీగా వుండిపోయింది. హేమాహేమీలున్నారు. బహుశా వారందరిలోకి చిన్న వాణ్ని అనుకుంటా.. నే వెళ్లి కూచున్నా.. ఆయన సాదరంగా పలకరించారు.
ఎన్టీఆర్ తన సహజశైలిలో మాట్లాడ్డం మొదలుపెట్టారు. చూడండి.. మళ్లీ అధికారంలోకి వచ్చాం గాని.. ఈ భవనానికి అటు వైపునంతా పేదలే.. అలాటి వారికి ఏదైనా చేయాలనిపిస్తుంటుంది ఎప్పుడూ.. మేధావులు విజ్ఞానవంతులు మీరు సలహాలు ఇవ్వాలి. సూచనలు చేయాలి అంటూ కాస్సేపు ఉద్వేగంగా మాట్లాడారు. రామోజీ రావు గారు ‘ ఐడియాలు మీకే బాగా వస్తాయి’ అన్నారు. అందరూ నవ్వారు. ఆర్టీసీలో చేసిన ఏదో మంచి మార్పును గురించి నేను చెబితే ముఖ్యమంత్రి చాలా ఆనందించారు. మరింత వివరించి చెప్పారు.
డైనింగ్ టేబుల్‌పై చాలా రకాల ఐటమ్స్ పెట్టారు. ఫలహారం చేసేవారికోసం ఇడ్లీ కారం చట్నీ కూడా పెట్టారు. చాలారుచిగా వుంటాయంటూ ఆయన అందరికీ ఇడ్లీ నెయ్యి వేయడం మొదలుపెట్టారు. అంతకు ముందే వారు లండన్ తెలుగు మహాసభ లో పాల్గొని వచ్చారు. మీరు లండన్ వెళ్లినప్పుడు కూడా ఇవే తిన్నారా అని నేనడిగాను. ఆ అక్కడ కూడా అన్నీ దొరుకుతున్నాయి. హాయిగా తిన్నాం..అంటూ సమాధానమిచ్చారు. అన్నీ దొరుకుతున్నాయి అనిరామోజీ గొంతు కలిపారు. అందరూ నిశ్శబ్దంతా తింటుంటే నేనే మళ్లీ కదిలించాను. మీరు రామాయణాన్ని కొత్త కోణంలో తీయాలని చూస్తున్నట్టు చెప్పారు అని అడిగాను. ఔనండి.. లక్ష్మీ కథ చెప్పింది. చాలా విప్లవాత్మకంగా వుంటుంది. రాముణ్ని సీత నిలదీసి ప్రశ్నించే కథ.. కాని దానికి మూలకథ ఎక్కడో దొరకలేదు. వెతుకుతున్నాం.. అన్నారు. దిగ్నాగుడు రాసిన కుందమాల ప్రధానంగా సీత లవకుశులతో నడుస్తుంది..చూసే వుంటారు అన్నాను. ఆయన ఒక్కసారిగా చాలా ఆసక్తి ప్రదర్శించారు. లక్ష్వీ పార్వతి కూడా కలుగుజేసుకున్నారు. తన పరిశోధన గురించి చెప్పారు. మీకు తెలిసే వుంటుంది కదా..అంటే దిగ్నాగుడు తెలుసండి.. అయితే ఈ పుస్తకం చూల్లేదు అన్నారు. అయితే తెప్పించండి..లేదంటే నా దగ్గర వుంటే చూసి పంపిస్తాను అని అన్నాను. ప్లీజ్ ప్లీజ్ అంటూ ఎన్టీఆర్ ఎంతో ఆసక్తి చూపించారు.
తర్వాత కొన్నాళ్లకే రాజకీయాలు ఆయన సినిమాలను మించిన వేగంతో మారిపోయాయి. రామారావు కథే మారింది. రాముడి కథ వెనక్కుపోయింది..
అప్పుడేం జరిగింది.. ఎలా జరిగిందనే దానిపై చాలా కథలు చెబుతుంటారు. ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచాడని అంటుంటారు. అయితే నేనెప్పుడూ అలా భావించలేదు. నిజానికి దాన్ని తిరుగుబాటు తప్ప వెన్నుపోటు కాదంటూ ఒక బుక్లెట్రాశాను. 25 వేలకు పైగా కాపీలు ఇరవై ఏళ్లకిందట జరిగిన ఇదే మహానాడు దగ్గర విక్రయించారు..
దాని గురించి మరోసారి చెప్పుకోవచ్చు.