మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో విడుదల చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. పెద్ద సినిమాలేవీ పోటీ లేకుండా చూసుకొంటున్నారు. ఒకవేళ మరో సినిమాతో ఢీ కొట్టాల్సివస్తే… ఆచి తూచి స్పందిస్తున్నారు. ఇద్దరు నిర్మాతలు కూర్చుని మాట్లాడుకొని, ఓ అంగీకారానికి వచ్చి.. సినిమా సినిమాకీ మద్య గ్యాప్ వచ్చేలా చూసుకొంటున్నారు. ఇంత చేసినా.. అప్పుడప్పుడూ రెండు సినిమాల మధ్య క్లాష్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్, నాగచైతన్య సినిమాలకూ అదే పరిస్థితి ఏర్పడే అవకాశాలున్నాయని టాలీవుడ్ టాక్.
ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ఎప్పుడో చెప్పేసింది. ఆ డేట్.. జనతా గ్యారేజ్ రిజర్వ్ చేసుకొని చాలా కాలమైంది. ఇప్పుడు నాగచైతన్య ప్రేమమ్ కూడా ఆగస్టు 12నే గురి పెట్టింది. తమ సినిమానీ అదే రోజు విడుదల చేయాలని ప్లాన్ చేస్తోందట. ఎన్టీఆర్ సినిమా వస్తోంది కదా.. అని చెబుతున్నా ప్రేమమ్ టీమ్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. బహుశా.. జనతా గ్యారేజీ అప్పటికి విడుదల కాదన్న ధీమానో, ఏమో?! అయితే ప్రేమమ్ ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసింది. ఆగస్టు వరకూ ఆగనవసరం లేదు. మరెందుకు ఆగస్టు 12న టార్గెట్ చేశారో?! పనిగట్టుకొని ఎన్టీఆర్ సినిమాతో పెట్టుకొంటే మాత్రం చైతూ సినిమాకి కష్టాలు తప్పవు.