ఎక్కడెక్కడో గెలవడం కాదు, తెలంగాణలో పార్టీని విజయపథంలో నడపడం అనే సవాల్ ను స్వీకరించడానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి తెలంగాణకు వస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితమే తెలంగాణలో బీజేపీ ఒక బలమైన పార్టీ. రానురానూ బలం కాస్తా బలహీనంగా మారిపోయి నామమాత్రపు పాత్రకే పరిమితమవుతోంది. తెలంగాణలో అక్కడక్కడా సంచలన విజయాలను సాధించే సమయంలో, అసోంలో బీజేపీ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. అలాంటి చోట, ఏకంగా అధికారంలోకి వచ్చింది. అయినా తెలంగాణలో ఇంకా నిస్తేజంగానే ఉంది.
1980లో ఆవిర్భవించిన బీజేపీ, 1984 ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే సాధించింది. వాటిలో ఒకటి తెలంగాణలో కావడం విశేషం. ఇందిరా గాంధీ హత్యానంతర సానుభూతి పవనాల్లో ప్రతిపక్షాలన్నీ కకావికలైన ఎన్నికలవి. అయినా, హన్మకొండ లోక్ సభ సీటును బీజేపీ గెల్చుకుంది. అదికూడా, అప్పటి బలమైన నాయకుడు పీవీ నరసింహారాపై విజయం సాధించి సీటును బీజేపీ కైవసం చేసుకుంది. సరిగ్గా అదే సమయానికి అస్సాంలో బీజేపీ అనామక పార్టీ. పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని పార్టీ.
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాదులో బీజేపీ బలాన్ని ఎవరూ విస్మరంచే పరిస్థితి ఉండేది కాదు. అలాగే కరీంనగర్, వరంగల్ లాంటి చోట్ల కూడా అది ప్రధాన పార్టీ. 2014 లోక్ సభ ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణపై అమిత్ షా దృష్టిపెట్టారు.
నాయుకులకు, కార్యకర్తలకు అనేకసార్లు దిశానిర్దేశం చేశారు. సరిగా పనిచేయని నాయకులకు తలంటారు. అయినా ఫలితం లేకపోయింది.
పార్టీని బలోపేతం చేయడంలో, కేడర్ లో జోష్ నింపడంలో నాయకత్వం విఫలమైంది. నిన్నమొన్నటి వరకూ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి,
ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నా, పార్టీని విజయపథంలో నడపడంలో విఫలమయ్యారు. కొత్త అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సత్తా ఏమిటో తెలియాల్సి ఉంది.
తెలంగాణతో పోలస్తే అసోంతో పాటు కర్ణాటకలోనూ బీజేపీ చాలా బలంగా ఉంది. కమలనాథులు మాత్రం కనీసం హైదరాబాదులోనూ బలాన్ని పెంచుకోలేకపోయారు. నగరంలో ఐదుగురు ఎమ్మెల్యేలున్నా, గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో కనీసం తలా ఒక కార్పొరేటర్ ను గెలిపించలేక పోయారు. ఒక్క ప్రేం సింగ్ మాత్రం తన నియోజకవర్గంలోని బేగంబజార్ డివిజన్ లో పార్టీని గెలిపించగారు.
2014 తర్వాత తెలంగాణలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన పేలవంగా ఉంది. ఒక్క గ్రాడ్యుయేట్స్ ఎమ్మల్సీ గెలవడం ఒక్కటే గొప్పగా చెప్పుకొనే విషయం. అలాంటి చోటికి, ఆదివారం ఆమిత్ షా వస్తున్నారు. పార్టీ కేడర్ తో విస్తృతమైన సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఏంచేయాలనేది నేతలకు సలహాలు ఇవ్వబోతున్నారు. మరి, ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.