బెట్టింగ్. జీవితాలను నాశనం చేసే వ్యసనం. ఐపీఎల్ బెట్టింగ్ మాయలోపడి సర్వం కోల్పోయిన వారిలో మరో అభినవ ధర్మరాజు చేరాడు. మహాభారతంలో ద్రౌపదిని ధర్మరాజు జూదంలో పందెం ఒడ్డి ఓడిపోయాడట. అలాగే ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ ప్రబుద్ధుడు ఐపీఎల్ బెట్టింగ్ లో తన బార్యను పందెం ఒడ్డాడు. ఓడిపోయాడు.
కాన్పూర్ లోని గోవింద్ నగర్ లో నివాసం ఉండే రవిందర్ సింగ్, తన భార్య జస్మీత్ కౌర్ ను పందెంలో ఓడాడు. అయితే ఎంతకు పందెం కాశాడనేది తెలియదు. ఇది జరిగిన తర్వాత అతడి భార్య నడిపే బొటిక్ షాప్ దగ్గరికి కొందరు వచ్చి వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె భర్త పరారీలో ఉన్నాడు.
ఈ దంపతులకు ఐదేళ్ల క్రితం పెళ్లయింది. అప్పటి నుంచీ డబ్బు సంపాదించడం కంటే ఖర్చు పెట్టడంలోనే తన కళను ప్రదర్శస్తున్నాడట. ఉన్నదంతా ఊడ్చి షేర్లలో పెట్టి నిండా మునిగాడట. ఆమె నగలను కూడా బలవంతంగా తీసుకుపోయి తాకట్టు పెట్టి లేదా అమ్మేసి షేర్ల వ్యాపారం చేశాడట. ఎంత తెలివిగా ఆ వ్యాపారం చేశాడో గానీ పూర్తిగా నష్టపోయాడట. ఆమె బొటిక్ నడుపుతూ వచ్చే డబ్బుతో ఇల్లు నెట్టుకొస్తోంది. అయినా ఆ పతిదేవుడికి బుద్ధి రాలేదు. క్రికెట్ బెట్టింగ్ లో భారీగా సంపాదించడానికి డబ్బులు తగలేశాడు. తర్వాత చేతిలో డబ్బులు లేకపోయేసరికి మహాభారతం సీన్ గుర్తుకు వచ్చినట్టుంది. భార్యనే ఒక వస్తువులా పందెంలో ఒడ్డాడు. చివరకు పందెంలో ఓడిపోయాడు.
క్రికెట్ లో బెట్టింగ్ కొత్త కాదు. అయితే ఐపీఎల్ పుణ్యమా అని అది మరీ ఎక్కువైంది. ఏకబిగిన రెండు నెలల పాటు సాగే ఈ టోర్నీలో ఎన్నెన్నో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వాటిలో బెట్టింగ్ ఒకటి. మొత్తానికి ఈ బెట్టింగ్ కారణంగా ఓ అభినవ ధర్మరాజు వెలుగులోకి వచ్చాడు.