ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను ఈసారి కర్కాటక నుంచి రాజ్యసభకు పంపాలని బిజెపి నిర్ణయించింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆర్ ఎస్ ఎస్ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్ మాధవ్ లేదా రైల్వే మంత్రి సురేష్ ప్రభు లలో ఒకరిని నిర్మలా సీతారామన్ స్ధానంలో ఎపి నుంచి రాజ్యసభకు పంపాలని బిజెపి ఆలోచిస్తున్నట్టు ఉన్నత స్ధాయి వర్గాల ద్వారా తెలిసింది.
రామ్ మాధవ్ లేదా సురేష్ ప్రభు లలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళుతున్నది ఎవరు అని ట్విట్టర్ లో ప్రశ్నించినపుడు ” నేను కాదు, ఖచ్చితంగా” అని రామ్ మాధవ్ ట్వీట్ చేశారు.
ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడుని ఎంపిక చేసే పక్షంలో ఆయన ఎంపిగా ఎన్నికవ్వడానికి కర్నాటక కంటే రాజస్ధాన్ మరింత సురక్షితమన్న ఆలోచనతో ఇపుడు ఆయన్ని రాజస్ధాన్ నుంచి రాజ్యసభకు పంపుతున్నారు.
తెలుగుదేశం బిజెపిల మధ్య రాష్ట్రస్ధాయిలోనే తప్ప కేంద్రస్ధాయిలో సంబంధాలు దెబ్బతినలేదు. ప్రజల్లో బలపడుతున్న ”ప్రత్యేక హోదా” సెంటుమెంటు వల్ల ఆవిషయంలో తాము వెనక్కి వెళ్ళేది లేదని ప్రజల్ని నమ్మించడానికే చంద్రబాబు ప్రతి అవకాశాన్నీ వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోకపోయినా సరే బిజెపితో మిత్రత్వాన్ని వొదులుకనేది లేదని పార్టీ అత్యున్నత వేదిక మహానాడులో చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన ఇబ్బందిని అర్ధం చేసుకోవడం వల్లా, ఈ సెంటిమెంటు తనకు కూడా సమస్యాత్మకమే కనుక బిజెపి అగ్రనాయకత్వం కూడా గుర్తించడంవల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మరింత సహకారిస్తూ వ్యవహరించాలని అది నేరుగా ప్రజలకు తెలిసేలా చూడాలని భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలు ముగిశాక కేంద్రమంత్రివర్గంలో ఇపుడు వున్న ఇద్దరికి అదనంగా మూడవ తెలుగు దేశం ఎంపికి కూడా చోటు కల్పించాలని కూడా బిజెపి ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
ఆర్ ఎస్ ఎస్ కు బిజెపికి మధ్య ప్రధాన సమన్వయ కర్తగా వున్న రామ్ మాధవ్ స్వస్ధలం అమలాపురం. రైల్వేమంత్రి సురేష్ ప్రభు ది మహారాష్ట్ర అయినా ఆయన ఇపుడు హర్యానా నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ సంస్ధాగత వ్యవహారాల్లో అత్యున్నత రామ్ మాధవ్ ఎపి నుంచి రాజ్యసభ సభ్యుడైతే తెలుగుదేశం బిజెపి సంబంధాలు రాష్ట్రస్ధాయిలో కూడా మెరుగయ్యే అవకాశాలు వున్నాయి.