భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్న హైదరాబాద్ వచ్చినప్పుడు, వారం రోజులలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడి పేరును ప్రకటిస్తామని చెప్పారు. గత రెండు నెలలుగా ప్రత్యేక హోదా అంశం కారణంగా తెదేపా, భాజపా మద్య కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడి వాటి మద్య దూరం పెరగడంతో, వాటి స్నేహం కొనసాగుతుందో లేదో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి అనిశ్చిత పరిస్థితులలో మిత్రపక్షం తెదేపాను వ్యతిరేకించే లేదా అనుకూలంగా ఉండే వ్యక్తిని అధ్యక్షుడుగా నియమించినట్లయితే, అది తెదేపాకి, రాష్ట్ర ప్రజలకి కూడా తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందనే ఉద్దేశ్యంతోనే ఇంతకాలం కంబంపాటి హరిబాబునే అధ్యక్షుడుగా కొనసాగిస్తున్నట్లు చెప్పవచ్చు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకి తెదేపా రాజ్యసభ సీటు కేటాయించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది కనుక ఆ రెండు పార్టీల మద్య సంబంధాలు మళ్ళీ గాడిన పడినట్లే భావించవచ్చు. కనుక మరికొంత కాలం ఆ రెండు పార్టీల స్నేహం కొనసాగే అవకాశాలున్నాయి కనుక తెదేపాకు ఇబ్బంది కలిగించకుండానే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయగల వ్యక్తిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించుకోవడానికి లైన్ క్లియర్ అయినట్లే భావించవచ్చు. బహుశః అందుకే వారం రోజులలోనే రాష్ట్ర భాజపా అధ్యక్షుడి పేరును ఖరారు చేస్తానని అమిత్ షా చెప్పి ఉండవచ్చు. ఈ ప్రకారం చూసినట్లయితే, తెదేపాను తీవ్రంగా వ్యతిరేకించే సోము వీర్రాజు వంటి వారికి కాకుండా, తెదేపాతో సఖ్యతగా ఉంటూనే అవసరమైనప్పుడు ధైర్యంగా నిలదీసి అడగగల ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వంటి వ్యక్తిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం కనబడుతోంది.