ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలలో మూడు తెదేపాకి ఒకటి వైకాపాకి దక్కల్సి ఉండగా, నాలుగు స్థానాలకి తెదేపా అభ్యర్ధులను నిలబెట్టాలని భావిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట రావు చెప్పడం విశేషం. ప్రస్తుతం విజయవాడలో పార్టీ మంత్రులు, సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కొనసాగుతోంది. మరికొద్ది సేపటిలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడవచ్చు. ఒకవేళ నాల్గవ సీటుకి తెదేపా అభ్యర్ధిని నిలబెట్టినట్లయితే, అప్పుడు వైకాపా తరపున నిలబడిన విజయసాయి రెడ్డితో కలిపి ఐదుగురు అవుతారు కనుక ఎన్నికలు అనివార్యం అవుతాయి. తెదేపాకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో కేవలం ముగ్గురిని మాత్రమే సునాయాసంగా గెలిపించుకోగలదు. కానీ నాల్గవ స్థానానికి కూడా అభ్యర్ధిని నిలబెట్టినట్లయితే, తప్పనిసరిగా వైకాపా ఎమ్మెల్యేల చేత క్రాస్ ఓటింగ్ చేయించావలసి ఉంటుంది లేదా ఎన్నికలలోగా మరో 20-25 మంది వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలోకి ఫిరాయింపజేయవలసి ఉంటుంది. ఆ భయంతోనే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలని సింగపూర్ తరలించాలని భావిస్తున్నట్లు సమాచారం. తెదేపా ప్రకటన వెలువడిన వెంటనే తరలిస్తారేమో? ఒకవేళ తెదేపా నాలుగు సీట్లకు పోటీ చేయడానికి సిద్ధపడినట్లయితే, అది తన నాల్గవ అభ్యర్ధిని గెలిపించుకోగలిగినా లేకపోయినా నేటి నుంచి ఆ రెండు పార్టీల నేతల మద్య దీనిపై మళ్ళీ భీకరమాటల యుద్ధం ఖచ్చితంగా మొదలవుతుంది.