అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్టు ఎవరికైనా తమ పిల్లలకంటే వారి పిల్లలంటేనే ప్రాణంగా వుంటుంది. అందులోనూ అన్ని అవకాశాలూ వున్న అధినేతల సంగతి చెప్పేదేముంది? ముద్దు మురిపాల వరకూ ఎవరైనా ఆనందిస్తారు గాని వారిని కూడా తమ రాజకీయ ప్రపంచంలోకి తీసుకురావాలనుకోవడంతోనే సమస్య. ఆ విధంగా చూస్తే ఇద్దరు తెలుగు వల్లభులు-కెసిఆర్, చంద్రబాబు నాయుడు మనవళ్లమాట పదేపదే వస్తూే వుంది.
తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజునుంచి కెసిఆర్ పక్కన చాలా సార్లు ఆయన మనవడు హిమాన్షు కనిపిస్తున్నాడు.ఒకసారి సచివాలయానికి వచ్చాడని వార్త.ఇయన చేసిన యాగం దగ్గరసరేసరి. అంతా అయ్యాక వాడి నిష్టను తాతగారే మీడియాలో ప్రస్తావించారు. ఈ కుర్రాడితో ఒక సినిమా లాటిది కూడా ప్రారంభించనున్నట్టు ప్రకటించి తర్వాత ఎందుకో మానేశారు. కాకపోతే ఈ క్రమంలో ఆ చిన్న పిల్లాడు ఒక ఖండన లాటి వివరణ కూడా పంపడం కొసమెరుపు.
ఇక నారా వారి మనవడి పేరు దేవాన్షు. చిన్న బుడతడే. కాని అమరావతిలో ప్రధాని మోడీ, రిలయన్న్ అంబానీ వంటివారి చేతుల్లోకి వెళ్లి ఫోటోలు తీయించుకున్నాడు. మనవడితో ఆడుకోవడానికి వచ్చానని ఒకసారి చంద్రబాబు కార్యాలయం సమాచారమిచ్చింది.మరోసారి ఆయనే విజయవాడలో మనవడితో భారీగా వేడుక జరిపి అందరినీ ఆహ్వానించారు.ఇక నిన్న తిరుపతి మహానాడులో లోకేష్ తన తండ్రి గొప్పతనం గురించి చెబుతూ మనవడితో ఆడుకోవాలనే కోర్కె అందరికీ వుంటుందని కాని తన తండ్రి దానికి కూడా తీరిక లేకుండా ప్రజల కోసమే పనిచేస్తున్నారని కొనియాడారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా తండ్రినీ తనయుడిని కూడా ప్రస్తావించిన లోకేష్ ధన్యుడు. ఏమైనా కసిగందుల గురించి ఈ రాజకీయ లోకంలో మాట్లాడ్డం మంచిదా అవసరమా?