మాజీ కేంద్ర మంత్రి వి.నారాయణ స్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రి కానున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆయన పోటీ చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 15మంది ఎమ్మెల్యేలు ఆయనను తమ శాసనసభా పక్ష నాయకుడుగా ఎన్నుకొన్నారు. కనుక ఆయన ఆరు నెలలోగా శాసనసభకి ఎంపిక కావలసి ఉంటుంది.
మొత్తం 30 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు డిఎంకె-2, మాజీ ముఖ్యమంత్రి రంగాస్వామికి చెందిన ఐ.ఎన్.ఆర్.సి.-8, ఇతరులు-1 స్థానాలు గెలుచుకొన్నారు. నారాయణ స్వామికి ఇద్దరు డిఎంకె సభ్యులు మద్దతు ఇవ్వడానికి అంగీకరించడంతో ఆయన ఇవ్వాళ్ళ ఉదయం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిని కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకి తన సంసిద్దతని వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజులలో ఆయన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఆయన, పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నమః శివాయంతో కలిసి సోమవారం సాయంత్రం డిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల శాఖల గురించి చర్చిస్తారు.
అసోం, కేరళ రాష్ట్రాలను చేజార్చుకొన్న కాంగ్రెస్ పార్టీకి పుదుచ్చేరిలో అధికారంలోకి రావడం గొప్ప విషయమేమీ కాకపోయినా, నాలుగు చోట్ల ఓడిపోయి ఆ ఒక్క చోటైనా గెలిచింది కనుక దానితోనే సంతోషపడక తప్పదు.