తెలంగాణాలో నల్గొండ జిల్లాలో ప్రముఖ కాంగ్రెస్ నేతలైన కోమటిరెడ్డి సోదరులు త్వరలో తెరాసలో చేరబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటిని వారిరువురూ చాలాసార్లు ఖండించినప్పటికీ ఈసారి తప్పకుండా వాళ్లిదరూ పార్టీ మారడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. యధాప్రకారం ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ వార్తలను ఖండించారు. కానీ ఈసారి ఆయన ఖండన ప్రకటనలో ‘నేను తెరాసలో చేరబోవడం లేదు’ అని చెప్పడంతో, తను చేరడం లేదు కానీ తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరుతున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. ఇంతకు ముందు ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు “మేమిద్దరం పార్టీ మారడం లేదు” అని ఖండిస్తుండేవారు.
మీడియాలో వస్తున్న ఈ వార్తలపై కోమటిరెడ్డి వెంకట రెడ్డి కానీ, ఆయన అనుచరులుగానీ ఇంతవరకు స్పందించకపోవడం గమనిస్తే, ఆయన పార్టీ మారే అవకాశాలున్నట్లు భావించవలసి ఉంటుంది. మల్కాజ్ గిరి తెదేపా ఎంపి మల్లారెడ్డి కూడా జూన్ 2నే తెరాసలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. బహుశః ఆయన కూడా జూన్ రెండునే తెరాసలో చేరుతారేమో?ఒకవేళ వెంకట రెడ్డి పార్టీని వీడి వెళ్ళిపోయినట్లయితే నల్గొండ జిల్లాకే చెందిన మరో సీనియర్ నేత కె జానారెడ్డి సంతోషించవచ్చు కానీ జిల్లాలో పార్టీ బలహీనపడుతుంది.