వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి తిరిగి వస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారా? ఢిల్లీలోనూ హైదరాబాదులోనూ వారి మాటలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు తన పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ప్రచారం చేసేందుకు వెళ్లినప్పుడు ఎన్‌సిపి అధినేత శదర్ పావర్ ఆయనకు సోనియా గాంధీని కలవమని సూచించారు. ఔను కాదనుకుండానే వచ్చేశారు. దానికి ముందునుంచి ఇక్కడ కొందరు కాంగ్రెస్ ముఖ్యులే వంటరిగా తమ పార్టీకి మనుగడ లేదని పెదవి విరుస్తున్నారు. మరి వైసీపీలో చేరతారా అంటే లేదు ఆయనే వస్తాడు కనీసం కలసి పనిచేస్తామని చెబుతున్నారు.
పాలేరు ఉప ఎన్నికలో మద్దతు కోరేందుకు వెళ్లిన భట్టి విక్రమార్క ఆయనతో చాలా సేపే సమావేశమైనారు.పూర్వాశ్రమంలో భట్టి రాజశేఖరరెడ్డికి సన్నిహితుడన్నది గమనించదగ్గ విషయం. ఇంకా కొందరు అధికార ప్రతినిధులు కూడా ఏదో ఒక రూపంలో కాంగ్రెస్ వాదులు కలసి పోరాడతారని చెబుతున్నారు. ఇవన్నీ గాక దిగ్విజయసింగ్ స్వయంగా అలాటి సంకేతమిచ్చారు. మొన్న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్‌కు శస్త్ర చికిత్స జరగాలని ఆయనే పిలుపునిచ్చారు. ఆ సందర్బంలో ఒక విలేకరి జగన్మోహన్ రెడ్డి,శరద్ పవార్ వంటివారంతా తిరిగి రావాలని మీ ఉద్దేశమా అని అడిగితే మరిన్ని పేర్లు కలిపి చెప్పారు. జగన్ తన పట్ల చూపిన ధిక్కారాన్ని సోనియా గాంధీ అంత సులభంగా క్షమించబోరని కొందరు అంటుంటే స్వంతంగా పెద్ద శక్తిగా స్థిరపడిన జగన్ మళ్లీ అధిష్టానాన్ని నెత్తిన పెట్టుకునే పని చేయబోడని మరికొందరంటున్నారు. అయితే కాంగ్రెస్ తిరిగి బతకాలంటే మాత్రం వైసీపీతో కలసి పనిచేయడం పొత్తు పెట్టుకోవడం తప్పదని చాలామంది అంటున్నారు.తల్లి కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ అని పిల్ల కాంగ్రెస్‌లా మిగిలిన పాత నాయకులు ఏం చేస్తారనేది వారి ఇష్టమని వైసీపీ వారు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు కన్నా జగన్నే ఎక్కువ వ్యతిరేకిస్తున్నారని అలాటి వారు ముందు ముందు తెలుగుదేశంలోనే కలసి పోతారని వైసీపీనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే బయిటకి వెళ్లిన వారంతా వచ్చి మళ్లీ కలసినట్టే జగన్ కూడా ఒకనాటికి రాకతప్పదని ఆయనతో విభేదించేవారి వాదన. అలాటివారు కూడా కలసి వ్యవహరించే అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు. బెంగాల్లో బద్ద విరోధిగా వున్న సిపిఎంతోనే తాము చేతులు కలపగా లేనిది తమలోంచి వెళ్లిన జగన్‌తో కలవడానికి ఇబ్బంది ఏముంటుందని కూడా ప్రశ్నిస్తున్నారు. దానికింకా సమయం వుందనేది వారి భావన.