సినిమా అవార్డుల ప్రధానం కార్యక్రమం అనగానే సినీ పరిశ్రమలో చిన్నపెద్దా తారలందరినీ ఒక్కచోట చూడవచ్చని అభిమానులు ఎంతో ఆశగా వస్తుంటారు. అందునా విదేశాలలో ఉన్న తెలుగువాళ్ళకయితే మరీ వెర్రి అభిమానం చూపిస్తారు. గత మూడు సం.లుగా దక్షిణాదిన ఉన్న తెలుగు, తమిళ, కన్నడ మరియు మళయాళ నటీనటులకు, సినీ పరిశ్రమలో గల వివిధ శాఖలలో ప్రతిభ చూపుతున్న సాంకేతిక నిపుణులకి ‘సౌత్ ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ పేరిట అవార్డులు ఇచ్చి గౌరవిస్తున్నారు. మొదట దుబాయి, తరువాత షార్జా, మళ్ళీ దుబాయి, తరువాత మలేషియా మళ్ళీ ఈసారి ఆగస్ట్ 6,7 తేదీలలో దుబాయ్ లో ఈ ‘సిమా’ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. నిన్న రాత్రి దుబాయి లో జరిగిన ఈ సిమా అవార్డుల కార్యక్రమంలో తెలుగుసినీ పరిశ్రమ నుండి కూడా అనేకమంది హేమాహేమీలు పాల్గొన్నారు. వారిని చూసేందుకు రెండు రాష్ట్రాలకి చెందిన తెలుగు ప్రజలు కూడా భారీగా తరలివచ్చారు.
అంతా అద్భుతంగానే సాగింది. కానీ మధ్యలో మన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ హీరో తప్ప తాగి స్టేజి మీదకు వచ్చి నానా రభస చేసినట్లు సమాచారం. అదిచూసి ఆ కార్యక్రమానికి వచ్చిన తెలుగువాళ్ళు, సినీ ప్రముఖులు కూడా సిగ్గుతో తలదించుకోవలసి వచ్చింది. “ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అని పాడుకొనేవాళ్ళం. కానీ పొరుగు దేశం వెళ్లి మన దేశం, మన తెలుగువాళ్ళ పరువు కూడా తీసేసాడు ఆ హీరో అని అందరూ బాధపడ్డారు. కొందరయితే ఇక ఆ కార్యక్రమం చూసేందుకు ఇష్టపడక మధ్యలోనే లేచి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఆ హీరో రాజకీయాలలో కూడా ఉన్నాడుట?