ఆర్ ఎస్ ఎస్ సంస్ధల్లోని ”భజరంగ్ దళ్ ”పురుషులకు, ”దుర్గావాహిని” మహిళలకు మారణాయుధాలు ప్రయోగించే శిక్షణ ప్రారంభించింది. శిక్షణా ప్రదేశాలలో కర్రసాము, కత్తి తిప్పడంతోపాటు గన్ పేల్చడం కూడా నేర్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో వున్న ఈ వాతావరణం అక్కడి ప్రజల్లో ఉద్వేగాన్ని రెకెత్తిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదేదో ఉగ్రవాదుల శిక్షణ లావుందన్న భయాందోళనలు, అభ్యంతరాలూ వ్యక్తమౌతున్నాయి. ఆత్మరక్షణకు శిక్షణ ఇవ్వడం నేరం కాదు అని ఆయా సంస్ధల ప్రతినిధులు వివరిస్తున్నారు.
ప్రజల అభ్యంతరాలమేరకు వారణాసిలోని ఓ స్కూల్లో ఏర్పాటైన దుర్గా వాహిని శిక్షణ శిబిరంపై దాడి చేశారు పోలీసులు. తనిఖీల్లో ఎయిర్ గన్స్ కూడా లేవని పోలీసులు స్పష్టం చేశారు. తాము ఎయిర్ గన్స్ తోనే ట్రెయినింగ్ ఇస్తున్నామని ట్రెయినర్లు అంటున్నారు. నోయిడాలో ఈ తరహా శిక్షణ తరగతులను అక్కడి పోలీసు యంత్రాంగం నిలిపి వేసింది. ఇదేశిక్షణ ఇచ్చినందుకు అయోధ్యలో భజరంగ్ దళ్ మీద పోలీసులు కేసుపెట్టారు.
ధన,మాన, ప్రాణాలను కాపాడుకోడానికి ఎంతకైనా తెగించవలసిందే! ఆత్మరక్షణకు శిక్షణ అవసరమే. కాళ్ళూ, దాడినుంచి కాపాడుకుంటూ దాడిచేసిన వారిని దెబ్బతీయడానికి చేతులనే ఆయుధాలుగా మలచుకునే కరాటే ముఖ్యంగా మహిళలకు అద్భుతమైన సాధన. శాంతి భద్రతలు ఎంత క్షీణిస్తున్నా మారణాయుధాలు పట్టుకుని తిరగవలసిన అవసరమూ లేదు, అది సాధ్యమూ కాదు.
ఈ సంఘటనలన్నీ వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే అతి పెద్దరాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లోనే జరుగుతూండటం గమనార్హం! 80 లోక్ సభా స్ధానాలున్న ఉత్తర ప్రదేశ్ లో గత లోక్ సభ ఎన్నికల్లో 71 సీట్లలో బిజెపి ఘన విజయం సాధించింది. అంతకు ముందు శాసనసభ ఎన్నికల్లో 407 స్ధానాలకు కేవలం 47 స్ధానాలు గెలిచి మూడోస్ధానాన్ని మిగుల్చుకుంది.
తొమ్మిది నెలల్లో జరిగే యుపి ఎలక్షన్లలో ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్నది బిజెపి లక్ష్యం!
బిజెపికి ఓట్లు సాధించడానికి సంఘ్ పరివార్ ”అయోధ్య రాముణ్ణి” ఆవెనుక వున్న మతాన్ని ప్రయోగించడం అధ్వానీ రధయాత్రతోనే మొదలైంది. మతావేశాన్ని రగిలించినవారికి మెజారిటీ మతస్తుల ఓట్లు లభిస్తాయన్న లాజిక్ ప్రకారం ఆడపిలల్లలకు తుపాకులు కాల్చడం నేర్పించడం ద్వారా ఏదో విరుచుకు పడబోతోందన్న వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ కు బిజెపి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా గోరఖ్ పూర్ ఎంపి యోగి ఆదిత్యనాధ్ ను ప్రకటించాలన్న వత్తిడికూడా పెరుగుతోంది. ”నచ్చని వాళ్ళు పాకిస్తాన్ పొండి”, షారుఖ్ ఖాన్ కు తీవ్రవాదులతో సంబంధాలు వున్నాయి” మొదలైన వ్యాఖ్యానాలతో నరేంద్రమోదీ తో సహా బిజెపి ని ఇరుకున పెట్టిన ”యోగి” ఈ ఆదిత్యనాధ్! ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇవ్వడం, ఆదిత్యనాధ్ పేరు పైకితీసుకురావడం మెజారిటీవర్గంలో ఉద్విగ్నతను రగిలించి ఓట్లు రాల్చుకోడానికే నని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.