తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థులుగా ఇద్దరూ పారిశ్రామిక వేత్తలను లేదా సంపన్నులను ఎంపిక చేశారని విమర్శలు వస్తున్నాయి. కేంద్రమంత్రి సుజనా చౌదరి ఎంపికకు సంబంధించి ఎప్పుడూ సందేహాలు లేవు. ఒక దశలో ఆయన బదులు లోకేశ్‌ను పంపిస్తారని కొందరు కావాలనే కథనాలు వదిలారు. అప్పట్లో ఆయనతో వాటిని ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి తనతోఅనలేదని,లోకేశ్ ఢిల్లీకి వస్తే మంచిదే కదా అని వ్యాఖ్యానించారు. వ్యాపారవేత్తగా తీసుకున్న రుణాలు కట్టడంలో ఆలస్యమై వుండొచ్చుగాని తానెప్పుడూ ఎగవేతదారుణ్ని కాదని, వన్‌టైం సెటిల్మెంట్లు కోరలేదని సుజనా అంటుంటారు. ఆయన కోర్టుకు హాజరు కానందుకు సమన్లు జారీ అయినప్పటికీ తర్వాత వెనక్కు తీసుకున్నారు. మిశ్రమ ప్రభుత్వంలో ఆయనను తప్పించి మరొకరిని పంపించడంలోనూ సమస్యలున్నాయనేది ఒకటైతే చంద్రబాబు ఆయనపై చాలా ఆధారపడటం అందరికీ తెలిసిన విషయం.
సుజనా చౌదరి గురించి చర్చ నడుస్తున్నది గాని నిజానికి కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన మాజీ మంత్రి టిజివెంకటేశ్ ఆరోపణలకు అతీతులు కారు. ఆయన ఎంపిక ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే కర్నూలులో దానిపై మీడియా కథనాలు వదులుతూనే వుంది. కొద్దిరోజుల కిందట కర్నూలు వెళ్లినప్పుడు నేను అవన్నీ చూశాను. కాకపోతే నాలుగో సీటుకు తనను ఎంపిక చేస్తే వైసీపీ ఓట్లు రాబట్టుకోగలనని టీజీ ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ కథనాలు సారాంశం.ఇప్పుడు నేరుగా రెండవ సీటు కేటాయించడంతో అనిశ్చితి అసలే తొలిగిపోయింది. రాయలసీమ, సామాజిక ప్రాతినిధ్యం వంటి మాటలు ఎన్ని చెప్పినా ఆర్థిక బలమే ఆయనకు టికెట్ తెప్పించింది. రాయలసీమ పేపర్ మిల్లు ఖాయిలా పడితే దానిపేర వనరులు తెచ్చి రాయలసీమ ఆల్కలీస్ పెంచుకున్నారనేది ఆయనపై కార్మిక సంఘాల ఆరోపణ. ఇక ఇండియన్ బ్యాంక్‌లోనూ ఇలాటి సమస్యలు రావడంతో డైరెక్టర్ పదవి నుంచి తప్పించారు.అంతేగాక విద్యుత్ ప్లాంటు పేరిట పెట్రోలు తీసుకుని తన బంకులో అమ్ముతున్నందుకు జరిమానా కట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇలాగే రైతుల పేరిట యూరియా తెప్పించి ఫ్యాక్టరీలో ఉపయోగిస్తున్నారనే మరో ఆరోపణ కూడా నడిచింది.దాన ధర్మాలు విరాళాలు నిర్మాణాలు చేసే వ్యక్తిగా ఎక్కడ చూసినా ఆయన పేరు కనిపిస్తుంటుంది గాని దాని వెనక చాలా వ్యవహారాలు నడుస్తున్నాయనేది రాజకీయ వర్గాల విమర్శ. అయితే అధికార పక్షం అందడండలతో వీటినుంచి తప్పించుకుంటుంటారని వారంటారు. జగన్ తిరుగుబాటు సమయంలో రోశయ్యకు కుడి భుజంగా నిలిచిన టిజి మంత్రి పదవిలో చివరి వరకూ వుండి వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పుడు కూడా పదవి ఇవ్వకపోతే రాయలసీమ ఆందోళన తీసుకొస్తారనే అంచనాతోనే చంద్రబాబు ఈ పదవి ఇచ్చారనేది ఒక వర్గం వాదన.
మరోవైపున ఆఖరు వరకూ టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్ చంద్రబాబు నాయకత్వంపై బహిరంగంగానే ధ్వజమెత్తారు. ఇది ఒకప్పటి ఎన్టీఆర్ నాటి తెలుగుదేశం కాదనీ, ఇక్కడ ధనవంతులదే చలామణి అని విమర్శించారు. గతంలో సుజనాచౌదరికి టికెట్ ఇచ్చినప్పుడు పార్టీ సీనియర్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు తనకు సన్నిహితులైన మీడియా వారితో సుజనా చౌదరిని గట్టిగా సమర్థిస్తూ ఈ విమర్శకులపై విరుచుకుపడ్డారు. ఏది ఏమైనా ఆర్థిక వనరుల విషయంలో అండగా వుండేవారిని ఆయన వదులుకోరని అందరికీ తెలుసు. ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా ‘చౌదరి వర్కవుట్ చెయి’ అంటుంటారని ఒక సీనియర్ నాయకుడే చెప్పారు.
ఇక సురేష్ ప్రభుకు బిజెపి తరపున ఇచ్చారు గనక బహుశా రైల్వే జోన్ తెప్పించి కొంత ఓదార్చే ప్రయత్నం చేస్తారు.