తెలుగు హీరోలు ఇప్పుడిప్పుడే కాస్త కొత్తదనం గురించి కూడా ఆలోచించడం మొదలెట్టారు. పాత్ర బాగుంటే చాలు.. ఇంకేం ఆలోచించడం లేదు. ఆఖరికి నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్ర అయినా సరే.. చేయడానికి రెడీ అంటున్నారు. తాజాగా అల్లుఅర్జున్‌కీ అదే ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది. సరైనోడు హిట్టుతో సూపర్ ఫామ్‌లోకి వచ్చేశాడు బన్నీ. ఇప్పుడు తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. లింగు స్వామి బన్నీకి కథ చెప్పడం, దాన్ని బన్నీ ఓకే చేయడం జరిగిపోయాయి. జులైలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ స్టోరీలో లేటెస్టు ట్విస్టు ఏంటంటే.. ఇందులో బన్నీ పాత్ర రెండు కోణాల్లో సాగుతుందట. ఓ పాత్రలో విలన్ షేడ్స్ ఉంటాయని.. హీరో, విలన్ రెండు పాత్రలూ బన్నీనే పోషిస్తున్నాడని టాక్.
లింగుస్వామిదంతా యాక్షన్ స్టైల్. కాకపోతే.. ఆయన కథల్లో ఎక్కడో ఓ చోట యునిక్ ఎలిమెంట్ ఉంటుంది. అలాంటి పాయింట్‌తో బన్నీని ఒప్పించాడట లింగుస్వామి. సరైనోడు తరవాత కథ విషయంలో చాలా తర్జన భర్జనలు పడిన బన్నీకి లింగుస్వామి కథపై గురి కుదిరిందని, చాలా ఆలోచించీ, ఆలోచించీ ఈ ప్రాజెక్టు ఓకే చేశాడని తెలుస్తోంది. స్ర్కిప్టు పనులు పూర్తి చేసుకొన్న ఈ సినిమా.. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల అన్వేషణలో ఉంది.