ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ… ఇలా హ్యాట్రిక్ కొట్టేశాడు నాని. హ్యాట్రిక్ మాట అటుంచితే – భలే భలేతో.. నాని మార్కెట్ విపరీతంగా పెరిగింది. ఆ సినిమా 30 కోట్లపైచిలుకు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ దశలో నాని ఎవరితో సినిమా చేస్తాడు? ఎలాంటి కథని ఎంచుకొంటాడు? అని ఆసక్తిగా ఎదురుచూశారంతా. కచ్చితంగా నాని ఓ స్టార్ దర్శకుడితోనే సినిమా చేస్తారనుకొన్నారు. కానీ నాని అందరి అంచనాల్నీ తలకిందులు చేస్తూ, ఇంద్రగంటి మోహనకృష్ణతో జట్టు కట్టాడు. ఇంద్రగంటి లాంటి క్లాస్ దర్శకుడితో సినిమా చేయడం నేరమేమీ కాకపోయినా షాకింగ్ విషయమే. ఎందుంకటే.. ఆయన అంతకు ముందు బందిపోటు అంటూ ఓ తలపోటు సినిమాని తీసి జనంలోకి వెళ్లారు. అది డిజాస్టర్ అయ్యింది. అయినా సరే, ఆ సినిమాని పట్టించుకోకుండా ‘నాతో అష్టాచమ్మా తీసి హిట్ ఇచ్చిన దర్శకుడు’ అన్న కన్సర్న్తో నాని ఇంద్రగంటికి జై కొట్టాడు. ఆ సినిమానే జెంటిల్ మెన్. సినిమా పూర్తయ్యింది.. ఇప్పుడు బయటకు వస్తోంది కూడా. జూన్ 17న జెంటిల్‌మెన్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.
అయితే ఈ సినిమా ఇన్సైడ్ టాక్ బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జెంటిల్మెన్లో మేటరేం లేదట. ఫస్టాఫ్ సోసోగా సాగిందని, సెకండాఫ్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. అయితే అవొక్కటే ఈ సినిమాని మోయలేవని ల్యాబ్ రిపోర్ట్. రషెష్ చూసిన నాని కూడా అంత సంతృప్తిగా లేడట. వెంటనే తన టీమ్‌ని కూర్చోబెట్టి మార్పులు, చేర్పులూ చేస్తూ బిజీగా ఉన్నాడట. ఇంద్రగంటి కూడా ”నాని హిట్టు హీరో అయిపోయాడు కదా” అని ఆయన చెప్పిందల్లా చేస్తున్నాడని టాక్. నాని నుంచి వినోదం ఆశిస్తారంతా. అయితే.. ఈ సినిమా వినోదానికి దూరంగా ఉంటూ.. సీరియస్‌గా సాగుతుంది అని తేలడంతో ఆడియన్స్‌కి ఎక్కుతుందా, లేదా అన్న కంగారు మొదలైంది. మరి.. జెంటిల్మెన్ ఏం చేస్తాడో, నాని నమ్మకాన్ని నిలబడెతాడో, వమ్ము చేస్తాడో తెలియాలంటే జూన్ 17 వరకూ ఆగాల్సిందే.