ఈసారి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను విశాఖపట్నంలో నిర్వహించాలనుకొంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక మరియు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు తెలిపారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీయాత్ర నుండి తిరిగివచ్చిన తరువాతనే దీనిపై తుది నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. ఈనెల 31 నుండి 5రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి యనమల విశాఖలో సమావేశాలు నిర్వహిస్తామని చెపుతున్నప్పటికీ హైదరాబాద్ అసెంబ్లీ భవనంలో సమావేశాలకు ఏర్పాట్లు చేయమని సిబ్బందికి ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. కనుక ముఖ్యమంత్రి తిరిగి వచ్చిన తరువాతనే సమావేశాల షెడ్యూల్ మరియు ఎక్కడ నిర్వహించేది ఖరారు కావచ్చును. మంత్రివర్గ సమావేశం ఎక్కడ నిర్వహించడానికయినా పెద్దగా ఇబ్బంది, ఖర్చు ఉండకపోవచ్చును. కానీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మాత్రం చాలా భారీ ఏర్పాట్లు, తదనుగుణంగానే భారీ వ్యయం అవసరం అవుతుంది. కనుక ఈసారి కూడా హైదరాబాద్ లో సిద్దంగా ఉన్న అసెంబ్లీ భవనంలోనే సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.