కాంగ్రెస్, భాజపాల మధ్య మళ్ళీ మరో కొత్త యుద్ధం ప్రారంభం అయింది. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకి ఆయుధ వ్యాపారి సంజయ్ బండారితో సంబంధాలున్నాయని, యూపియే ప్రభుత్వ హయాంలో జరిగిన రెండు రక్షణ ఒప్పందాలలో ముడుపులు అందుకొన్నారని, అంతే కాకుండా రాబర్ట్ వాద్రాకి సంజయ్ బండారి లండన్ లో ఒక విలాసవంతమైన భవనం బహుమతిగా ఇచ్చారని భాజపా ఆరోపించింది. దానిపై రక్షణ శాఖలో అంతర్గత విచారణకు ఆదేశించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కూడా విచారణ జరుపుతోంది.
సహజంగానే, కాంగ్రెస్ పార్టీ అవి నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిన్న ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి నియోజక వర్గంలో పర్యటించినప్పుడు ఆమె మీడియాతో మాట్లాడుతూ “భాజపాకి, మోడీ ప్రభుత్వానికి నిత్యం మామీద ఏదో ఒక నిరాధారమైన అవినీతి ఆరోపణ చేయడం అలవాటుగా మారిపోయింది. దాని “కాంగ్రెస్ రహిత భారత్” కుట్రలో భాగంగానే అటువంటి ఆరోపణలు చేస్తోంది. మా కుటుంబ సభ్యులపై, మా పార్టీ, మా యూపియే ప్రభుత్వంపై బురద జల్లడం ద్వారా ప్రజలకు మమ్మల్ని దూరం చేయాలని కుట్ర పన్నుతోంది. కానీ ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీని విడదీయడం ఎవరివల్లా కాదని గ్రహిస్తే మంచిది. నా అల్లుడు రాబర్ట్ వాద్రా అమాయకుడు. అతను ఎటువంటి తప్పులు చేయలేదు. ఒకవేళ తప్పు చేసినట్లు మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లయితే తన చేతిలోనే ఇప్పుడు అధికారం ఉంది కనుక విచారించి చర్యలు తీసుకోవచ్చు కదా? మోడీని ఎవరు అడ్డుకొంటున్నారు?” అని ప్రశ్నించారు.
“ప్రధాని నరేంద్ర మోడీ తనని తాను షహన్ షా (చక్రవర్తి)ని అనుకొంటున్నారు. ఆయన మంత్రులు, పార్టీ నేతలు కూడా అదేవిధంగా భావిస్తూ ఆయననాకి భజన చేస్తున్నారు. కానీ ఆయన దేశానికి ప్రధాన మంత్రే తప్ప చక్రవర్తి కాదని గ్రహిస్తే మంచింది. దేశంలో కరువు తాండవిస్తుంటే, దానిని పట్టించుకోకుండా రెండేళ్ళ పాలన పూర్తయినందుకు మోడీ ప్రభుత్వం సంబరాలు జరుపుకోవడం చాల బాధ కలిగిస్తోంది. మేము కూడా పదేళ్ళు అధికారంలో ఉన్నాము కానీ ఏనాడూ ఈవిధంగా సంబరాలు జరుపుకోలేదు,” అని సోనియాగాంధీ విమర్శించారు.
మోడీ ప్రభుత్వ ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ విమర్శలు వింటుంటే, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాటి గురించి చెప్పిన ఒక మాట గుర్తుకు వస్తుంది. “కాంగ్రెస్, భాజపాలు నిత్యం కీచులాడుకొనే భార్యాభర్తల వంటివి. వాటికి ఒకదాని రహస్యాలు మరొకదానికి తెలుసు. అందుకే అవి ఎప్పుడూ కీచులాటల వరకే పరిమితం అవుతుంటాయి తప్ప అంతకి మించి ముందడుగు వేయవు. ఆ రెండూ బద్దశత్రువులలాగ భీకరంగా పోరాడుకొంటూనట్లు నటిస్తూ దేశ ప్రజలను మోసం చేస్తుంటాయి,” అని అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లుగానే ఆ రెండు పార్టీలు నిన్నమొన్నటి వరకు నేషనల్ హెరాల్డ్, ఆగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణాలపై పార్లమెంటు లోపల, బయటా భీకర యుద్ధం చేశాయి. ఆ తరువాత ఆ ఊసే ఎత్తడం లేదిప్పుడు. మళ్ళీ ఆ తరువాత నేవీ ఆయిల్ ట్యాంకర్ షిప్పుల కొనుగోలు కుంభకోణంపై వాదులాడుకొన్నాయి. దానినీ పక్కనపడేసి మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త యుద్దం ఆరంభించాయి.
సోనియా గాంధీ చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీపై మోడీ ప్రభుత్వం ఒకదాని తరువాత మరొక ఆరోపణలు చేస్తూనే ఉండవచ్చు దానిని కాంగ్రెస్ పార్టీ త్రిప్పికొడుతూనే ఉండవచ్చు. కానీ దేనిపైనా కూడా విచారణ జరిపించి, దోషులను శిక్షించకపోవచ్చునని నేషనల్ హెరాల్డ్ కేసు ముగిసిన తీరు గమనిస్తే అర్దమవుతుంది. అంటే అరవింద్ కేజ్రీవాల్ వాటి గురించి చెప్పినమాట నిజమేనని నమ్మవలసి ఉంటుంది.