చిరంజీవి 150వ సినిమాలో సునీల్‌కి సూపర్ ఛాన్సొచ్చిన సంగతి తెలిసిందే. చిరుతో కలసి సినిమా అంతా కనిపించే అవకాశం అది. కానీ.. సునీల్ కొన్ని కారణాల వల్ల నో చెప్పాడు. దాంతో ఆ అవకాశం వెన్నెల కిషోర్ చేతికి వెళ్లింది. సునీల్ `నో` చెప్పడానికి బలమైన కారణమే ఉంది. ఏకంగా చిరు సినిమాకి 40 రోజుల ఏకధాటి కాల్షీట్లు కేటాయించాల్సివచ్చింది. సునీల్ హీరోగా చేస్తున్న రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. వాటిని చిరు సినిమా కోసం పక్కన పెట్టాల్సివచ్చింది. ఆయా నిర్మాతలు ఇబ్బంది పడతారేమో అన్న కారణంగా సునీల్ చిరు సినిమా నుంచి తప్పుకొన్నాడు.
సునీల్‌పాయింట్ ఆప్ వ్యూ నుంచి అది సరైన నిర్ణయమే కావొచ్చు. కానీ.. ఈ సినిమాని వదులుకొని సునీల్ తప్పు చేశాడేమో అనిపించకమానదు. ఎందుకంటే సునీల్ హాస్య పాత్రలు మానేసి ఎప్పుడైతే హీరో అయిపోయాడో.. అప్పటి నుంచీ సునీల్ ప్లేస్ అలానే ఖాళీగా ఉండిపోయింది. మధ్యలో ఎంతమంది కమెడియన్లు వచ్చినా సునీల్‌ని భర్తీ చేయలేకపోయారు. హీరోగా సునీల్ కెరీర్ ఏమాత్రం బాగోలేదు. వరుస డిజాస్టర్లు తగులుతున్నాయి. హీరోగా బండి నల్లేరు మీద నడక కాదన్న సంగతి సునీల్‌కి అర్థమైంది. మళ్లీ కామెడీ పాత్రలు పోషిస్తే.. తనకు పూర్వవైభవం వచ్చేది. అదీ.. చిరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చుంటే… ఘనంగా ఉండేది. ‘మా బాస్ కోసం కమెడియన్ అయ్యా…’ అని చెప్పుకోవడానికీ బాగుండేది. దాంతో పాటు… సునీల్‌కి మంచి పారితోషికమే గిట్టుబాటు అయ్యేది. బంగారం లాంటి అవకాశం.. సునీల్ పాడుచేసుకొన్నాడు. బ్యాడ్ లక్.