పేరు, అధికారం, పలుకుబడి వున్న కనీసం 35 కార్పొరేషన్లకు చైర్మన్లను, పాలక వర్గాలను ఇప్పట్లో నియమించే అవకాశాలు లేవు. ఈ పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణాలో నామినేటెడ్ పదవులకోసం ఎదురుచూస్తున్న తెలుగుదేశం, టిఆర్ఎస్ పార్టీల రెండు, మూడు స్ధాయల నాయకులకు నిస్పృహను మిగులుస్తోంది.
రాష్ట్రస్ధాయి సంస్ధలు, కార్పొరేషన్లు విభజన తరువాత కూడా రెండు రాష్ట్రాల్లోనూ పని చేస్తున్నాయి. విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్ళ ప్రకారం వాటి ఆస్ధులు, అప్పులను జనాభా దామాషాలో 52 శాతం ఆంధ్రప్రదేశ్, 48 శాతం తెలంగాణా పంచుకోవాలి. రెండురాష్ట్రాలు చర్చలు సంప్రదింపుల ద్వారా పంపకాలు పూర్తి చేసుకోని పక్షంలో కేంద్రమే జోక్యం చేసుకుని వాటాలు పంచుతుంది.
ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అధికారుల స్ధాయిలో పరస్పరం ఉత్తరాలు రాసుకుంటున్నారు. అయితే ఎపి అధికారి రాసిన లేఖకు తెలంగాణా అధికారి, అలాగే తెలంగాణా అధికారి రాసిన లేఖకు ఎపి అధికారి సమాధానాలు ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రుల స్ధాయిలో పూనుకుంటే తప్ప సంప్రదింపుల ప్రక్రియ మొదలేకాదు.
దాదాపు అన్ని సంస్ధల ప్రధాన కార్యాలయాలూ హైదరాబాద్ లోనే వున్నాయి. వాటి ఆంధ్రప్రదేశ్ యూనిట్ల పరిస్ధితి గాలిలో వున్నట్టు అయిపోయింది. ఉదాహరణకు తెలుగు విశ్వ విద్యాలయం ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో వుండగా, రెండు పీఠాలు తెలంగాణాలో, మూడు పీఠాలు ఎపిలో వున్నాయి. ఈ మూడు పీఠాలకూ సిబ్బంది జీతాల చెల్లింపును కూడా హైదరాబాద్ కార్యాలయం నిలిపివేసింది. దీంతో ఎపి ప్రభుత్వం వీరికి ఇతర నిధుల నుంచి జీతాలు ఇస్తోంది. దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్ధులున్న ఈ సంస్ధలో ఎపి కి ఎంత వస్తుందో తేలే వరకూ తాత్కాలిక ఏర్పాట్లతోనే పని చేస్తున్నాయి.
రాష్ట్రగ్రంధాలయ సంస్ధ వంటి ఎన్నో సంస్ధల పరిస్ధితి ఇంతే! ఇందువల్లే ఎపిలోని 13 జిల్లాల గంధాలయ సంస్ధలకూ చైర్మన్లనూ పాలకవర్గాలనూ ప్రభుత్వనియమించలేదు. పాలక వర్గాలు లేకుండా అధికారుల పాలనతో నడుస్తున్న ఇలాంటి సంస్ధలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 30 నుంచి 40 వరకూ వున్నాయి.
చైర్మన్లను, పాలక వర్గాలను నియమించడంలో రూలింగ్ పార్టీల గురి రాజకీయ సమీకరణాలు, పదవుల పంపకాల మీదే వుంటుంది. అందరినీ బెలెన్స్ చేస్తూ నామినేటెడ్ పోస్టులు నింపడంలో కొంత ఆలస్యం అనివార్యంగా వుంటుంది. పార్టీ నాయకులను పడిగాపులు పడేలా చేసి, ఊరించి, ఊరించి పదవులు ఇచ్చే , అందుకునే రాజకీయ క్రీడలో మజాయే వేరు.
తెలుగురాష్ట్రాల్లో ఇపుడు జరుగుతున్న ఆలస్యం. అలాంటి మజా ఇచ్చేదికాదు. రెండు రాష్ట్రాల రాజకీయ నాయకత్వాలూ కలసి కూర్చుంటే తప్ప ఇందులో వున్న సాంకేతిక అవరాధాలు తొలిగే అవకాశం లేదు. అది ఎప్పటికి జరుగుతుందో చెప్పేవారు కూడా లేరు!