సరైనోడు సూపర్ హిట్ కొట్టింది సరే, కానీ బోయపాటి శ్రీను మాత్రం సమీక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. మరీ ఇంత రొటీన్ కథ, కథనాలేంటి? అని విశ్లేషకులు విరుచుకుపడ్డారు. యాక్షన్ డోస్ మరీ ఎక్కువైందని.. ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త వెనక్కి తగ్గారు. బోయపాటి దమ్ము.. మాస్, యాక్షన్ కథలే. అయితే వాటి నుంచి కాస్త బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు బోయపాటి కూడా అదే ఆలోచిస్తున్నట్టు టాక్. సరైనోడు తరవాత బెల్లంకొండ శ్రీనివాస్ తో బోయపాటి ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో అయినా.. కాస్త ఫార్ములా మార్చాలని డిసైడ్ అయ్యాడట బోయపాటి.
బెల్లంకొండ శ్రీను కోసం ఆల్రెడీ.. ఓ లవ్ స్టోరీని సిద్ధం చేశాడు బోయపాటి. అయితే ప్రస్తుతం ఆ కథని పక్కన పెట్టి కొత్త కథ రాస్తున్నాడట. ఈసారిమాత్రం కథలో కాస్త థ్రిల్లింగ్ అంశాల్నీ జోడించి, తనపై పడిన హెవీ యాక్షన్ ముద్రని కాస్త మార్చుకోవాలని చూస్తున్నాడు. బెల్లంకొండ మాత్రం `మీ శైలిలోనే సినిమా తీయండి` అని బోయపాటికి చెబుతున్నా – డోసు తగ్గించాలని బోయపాటి భావిస్తున్నట్టు వినికిడి. అందుకే కథలో మార్పులూ చేర్పులూ చేస్తున్నాడని, బెల్లంకొండ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం అదే అని తెలుస్తోంది. మొత్తానికి బోయపాటి కాస్త మారాలని ఆలోచిస్తున్నాడు. మార్పు మంచిదే కదా.. కానీవ్వండి.