ఈశాన్య రాష్ట్రాలకు భాజపాని విస్తరించాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ పాలిత అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఆ పార్టీ చేసిన ప్రయత్నాల గురించి తెలిసిందే. మొన్న జరిగిన ఎన్నికలలో అసోంలో కూడా అధికారంలోకి రావడంతో భాజపా నూతనోత్సాహంతో మిగిలిన ఈశాన్య రాష్ట్రాలపై కూడా కన్నేసినట్లుంది. మేఘాలయ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిత మైనార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి భాజపా కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు డి.డి.లపాంగ్, ఇద్దరు రాష్ట్ర మంత్రులతో భాజపా సీనియర్ నేతలు రాం మాధవ్, హిమంత బిశ్వాలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా పట్ల కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతిని భాజపా నేతలు ఒక సదావకాషంగా వినియోగించుకొని, తమ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. భాజపా అప్రజాస్వామిక విధానాలతో అధికారం కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని, దానిని గట్టిగా ఎదుర్కొంటామని ఆమె హెచ్చరించారు.
ఆమె ఆరోపణలను భాజపా ఖండించింది. కాంగ్రెస్ పార్టీ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోలేక భాజపాని నిందిస్తోందని రాం మాధవ్ జవాబిచ్చారు.
మొత్తం 60 మంది సభ్యులు గల మేఘాలయ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 30 మంది, స్వతంత్ర అభ్యర్ధులు-13మంది, మిగిలినవారు ఇతర పార్టీలకి చెందినవారున్నారు. భాజపాకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు. మిత్రపక్షాల మద్దతుతో నడిపించవలసిరావడం వలన బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా పట్ల అసమ్మతి కూడా తోడవడంతో ఇంకా బలహీనపడింది. దానిని భాజపా ఒక సదావకాశంగా వినియోగించాలనుకొంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అది నిజమే అయ్యుండవచ్చు. కానీ శాసనసభలో భాజపాకి ఒక్క సీటు కూడా లేదు కనుక అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదోవిధంగా అసమ్మతిని రాజేసి ప్రభుత్వాన్ని కూల్చినా స్వయంగా రాష్ట్రాన్ని పరిపాలించలేదు. కనుక తనకు అనుకూలంగా ఉండే నేతలకి ఆ అవకాశం కల్పించి, వారి అందదండలతో ఆ రాష్ట్రంలో కూడా బలపడేందుకు ప్రయత్నించవచ్చునని భావిస్తోందేమో?