ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ “ఆత్మవిమర్శ చేసుకొంటాము, లోపాలు సరిదిద్దుకొంటాము” అని చెప్పినపుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ “ఇప్పుడు ఆత్మవిమర్శ కాదు.. కాంగ్రెస్ పార్టీకి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయవలసి ఉంది. సమూలంగా ప్రక్షాళన జరిపితే తప్ప పార్టీ కోలుకోదు,” అని హెచ్చరించారు. యధాప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఆయనకి మద్దతుగా కొందరు, వ్యతిరేకిస్తూ కొందరూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. కానీ అంతిమంగా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకిశస్త్రచికిత్స చేయడానికే సిద్దపడినట్లున్నారు. అందుకే ఆ పార్టీలో సీనియర్ నేతలు అజయ్ మకన్, కమల్నాథ్, రణదీప్ సుర్జేవాలా, అమరిందర్ సింగ్ రాజా, అశోక్ తన్వార్ వేణుగోపాల్ తదితరులు అందరూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించి, రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నారంటూ నమ్మకంగా చెపుతున్నారు. కానీ గులామ్ నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ వంటి కొందరు సీనియర్ నేతలు రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి వ్యతిరేకిస్తున్నారు. ఏ నిర్ణయమైన సమిష్టిగానే తీసుకొంటామని చెపుతున్నారు.
గత రెండేళ్లుగా రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించడంపై పార్టీలో జరుగుతున్న ఇటువంటి చర్చలు, తదనంతర నాటకీయ పరిణామాల కారణంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర అప్రదిష్ట పాలైంది. కనుక ఇప్పుడు ఇంత చర్చ జరిపిన తరువాత మళ్ళీ సోనియా గాంధీయే అధ్యక్షురాలిగా కొనసాగితే రాహుల్ గాంధీ మళ్ళీ అలిగి విదేశాలకు వెళ్లిపోవచ్చు. అప్పుడు ఆయన, కాంగ్రెస్ పార్టీనలుగురిలో నవ్వులపాలవక తప్పదు. కనుక త్వరలోనే రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించం ఖాయమేనని భావించవచ్చు. లేదా ప్రియాంకా గాంధీ, పార్టీలో సీనియర్ నేతలు అంగీకరిస్తే ఆమెకు పార్టీ పగ్గాలు అప్పజెప్పినా ఆశ్చర్యం లేదు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నియమించబోతున్నట్లు మీడియాలో వార్తలపై భాజపా నేతలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహిస్తే ఇక భాజపాకి, మోడీ ప్రభుత్వానికి తిరుగే ఉండదని లోలోన సంతోషపడుతున్నారు. కానీ పైకి మాత్రం అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని దానితో తమకు సంబంధం లేదని చెపుతున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీలో నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగిస్తే భాజపాకి అంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది?