వైకాపా నుంచి ఇంతవరకు మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారు. ఇవ్వాళ్ళ (గురువారం) కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కూడా తెదేపాలో చేరితే మొత్తం 19 అవుతారు. తెదేపా నేతలు ఇంతవరకు ఎవరితో పోరాడుతున్నారో వారినే పార్టీలో చేర్చుకోవడం వలన వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వైకాపా నుంచి వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్న కొద్దీ తెదేపా బలపడుతోంది, వైకాపా బలహీనపడుతోంది అని సంబరపడుతుంటే, మధ్యలో ఈ ఘర్షణల వలన పార్టీలో పాతకాపులకి, కోటి ఆశలతో పార్టీలో అడుగుపెట్టిన వైకాపా ఎమ్మెల్యేలకి కూడా మనశాంతి లేకుండా పోతోంది. అయితే ఇవ్వాళ్ళ పార్టీలో చేరబోతున్న పోతుల రామారావుకి మాత్రం చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగించే అపూర్వ అనుభవం ఎదురైంది.
కందుకూరు నియోజకవర్గ తెదేపా ఇన్-చార్జ్ దివి శివరాంతో స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు కలిసి ఇవ్వాళ్ళ ఉదయం రామారావు ఇంటికి వెళ్లి ఆయనకి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజక వర్గంలో అందరం కలిసిమెలిసి పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేద్దామని చెప్పడంతో రామారావు కూడా చాలా సంతోషించి అంగీకరించారు. ఇంతవరకు 18 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారు కానీ వారెవరికీ తెదేపా నేతలు ఈవిధంగా స్వాగతం పలుకలేదు. వాళ్ళే స్వయంగా బారీ బహిరంగసభ ఏర్పాటు చేసుకొని తెదేపా నేతలని ఆహ్వానించడమో లేదా తమ అనుచరులను వెంటబెట్టుకొని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి పార్టీ కండువాలు కప్పుకొని తిరిగి వెళ్లడమో చేసేవారు. రామారావుకి మాత్రం తెదేపా నుంచి సాధరంగా ఆహ్వానం లభించడం విశేషమే. తెదేపా నేతలందరూ కూడా వైకాపా ఎమ్మెల్యేలపట్ల ఇదేవిధంగా సాదరంగా వ్యవహరించినట్లయితే, తెదేపాలో చేరాలా వద్దా అని ఊగిసలాడుతున్నవారు కూడా వచ్చే చేరే ఆలోచన చేయవచ్చు. నిత్యం ఘర్షణలు పడుతుంటే, వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్లిపోవచ్చు. అప్పుడు తెదేపా పని వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు అవుతుంది.