అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిత్వం ఖరారైన డోనాల్డ్ ట్రంప్ కు వివిధ వర్గాల ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. అయితే, సుప్రసిద్ధ సిలికాన్ వ్యాలీలో మాత్రం ఆయనకు అలా మద్దతు కనిపించడం లేదు. సిలికాన్ వ్యాలీలోని కంపెనీల అధిపతులకు, అక్కడి టెకీలకు ట్రంప్ మొదటి చాయిస్ కాదట. కనీసం రెండో, మూడో చాయిస్ కూడా కాదట. ట్రంప్ తమకు శ్రేయోభిలాషి కాదని అక్కడి వారు నమ్ముతున్నారట.
సాంకేతిక నిపుణులు అమెరికాలోకి వలస రావడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అయితే సిలికాన్ వ్యాలీలో పనులు జరగాలంటే భారత్ వంటి దేశాల నుంచి తురుపుముక్కల్లాంటి టెకీలు రావాల్సిందే.
కంపెనీలు లాభాల బాటలో కొనసాగాలంటే ఈ తరహా ఇమిగ్రేషన్ అనివార్యం. కానీ ట్రంప్ విధానాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయనేది సిలికాన్ వ్యాలీలో టాక్.
అమెరికాలోని ఉద్యోగాలు అమెరికన్లే చేయాలనే ట్రంప్ ఉద్దేశం తప్పు కాకపోవచ్చు. కానీ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ అర్హత ఉన్న అమెరికన్లు ఎంతమంది అనేది కూడా చూడాలి. నిజానికి, భారత్, చైనా వంటి దేశాల నుంచి నిపుణులైన ఇంజినీర్లు రాకపోతే అమెరికాలో చాలా కంపెనీల్లో పనులు సాఫీగా జరగడం కష్టం.
ట్రంప్ పై మొదటినుంచీ కొన్ని వర్గాల అమెరికన్లలో వ్యతిరేకత కనిపిస్తోంది. ముస్లింలకు, మెక్సికన్లకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సెక్యులరిజం గురించి మాట్లాడే వారు ట్రంప్ ను తీవ్రంగా విమర్శించారు. తర్వాత భారత్, చైనా ఉద్యోగుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా మంది కోపం తెప్పించాయి. ఆయన అధ్యక్షుడైతే తమ ఉద్యోగాలు ఊడిపోతాయేమో అని చాలా మంది ఆందోళన చెందారు. సిలికాన్ వ్యాలీలోనూ ట్రంప్ కు సానుకూల వాతావరణం లేకపోడం వింతేమీ కాదంటున్నారు పరిశీలకులు.
హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ లలో ఎవరు గెలుస్తారో గానీ, భారత్ లో మాత్రం ట్రంప్ వైపే మొగ్గు కనిపిస్తోంది. పాకిస్తాన్ పట్ల కఠిన వైఖరి అవలంబించాలనే ఆయన విధానం చాలా మంది భారతీయులకు నచ్చింది. దాయాది దేశం మనపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నందుకు సగటు భారతీయుడికి పాకిస్తాన్ అంటే అగ్గిమంట.
ట్రంప్ అధ్యక్షుడైతే అగ్రరాజ్యం పాకిస్తాన్ ఇష్టారాజ్యాన్ని సహించే పరిస్థితి ఉండదని, భారత్ కు అనుకూలత ఉంటుందని చాలా మంది నమ్ముతున్నారు. అందుకే భారతీయుల్లో చాలా మంది ట్రంప్ గెలవాలని కోరుకోవడం విశేషం.