కాంగ్రెస్ అధ్యక్ష పదవికి త్వరలో రాహుల్ గాంధీ ఎంపిక కాబోతున్నారంటూ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగడం బీజేపీ నేతలు చాలా సంతోషం కలిగిస్తోంది. అదే జరిగితే తమకు అచ్ఛే దిన్, అంటే మంచి రోజులు వచ్చినట్టే అంటున్నారు. అంటే ఏమిటి అర్థం?
ఈ విషయంలో అందరి కంటే ముందు స్పందించిన వ్యక్తి, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ.
రాహుల్ కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగిస్తే మాకు మంచి రోజులు వచ్చినట్టే అని మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. రాహుల్ పై విరుచుక పడటానికి ఆమెకు మరో కారణం కూడా ఉంది. 2014 ఎన్నికల్లో ఆమె అమేథీ నుంచి రాహుల్ పై పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ ను ఓడించడానికి అమేథీపై పూర్తిగా దృష్టి పెట్టారు. కాబట్టి ఏ చిన్న అవకాశం దొరికినా రాహుల్ పై దాడి చేస్తుంటారు. రాహుల్ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా స్మృతిపై విమర్శలు చేస్తుంటారు.
అదేంటో గానీ ప్రత్యర్థి పార్టీ నాయకుడు వస్తున్నాడంటే అతడి వ్యూహం ఏమిటని ఆరా తీయడం మామూలే. కొన్ని ప్రాంతీయ పార్టీల విషయంలోనూ బీజేపీ నేతలు జాగ్రత్తగా అన్నీ గమనిస్తుంటారు. కానీ రాహుల్ గాంధీ విషయంలో మాత్రం అలాంటి జాగ్రత్త కనిపించడం లేదు. పైగా రాహుల్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నికల సమయంలో రాహుల్ ఎక్కువ చోట్ల ప్రచారం చేయాలని వ్యాఖ్యానించారు. ఆయన ప్రచారం చేసే సీట్లన్నీ మావే అని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్చక్షుడైన తర్వాత విజయ పరంపర లేదు. పరాజయ పరంపర కొనసాగుతోంది. యూపీఏ ప్రభుత్వంప వెల్లువెత్తిన వ్యతిరేకతను తట్టుకోవడం మామూలు విషయం కాదు. కాబట్టి ఆ ఓటమి ఒక్క రాహుల్ గాంధీ వైఫల్యం కాదనుకుందాం. వరసగా రాష్ట్రాల్లో పార్టీ ఓటమి పాలు అవుతున్నా ఆయన వైఖరి మారడం లేదనే విమర్శ కాంగ్రెస్ లోనే ఉందని వార్తలు వస్తున్నాయి. పార్టీని ముందుండి నడపాల్సిన వ్యక్తి హటాత్తుగా 60 రోజులు అడ్రస్ లేకుండా పోవడం నాయకత్వ లక్షణమా అని విమర్శలు వచ్చాయి.
రాజకీయ పరిణతిగానీ, ఒక దశ దిశ విజన్ గానీ లేని రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు అధ్యక్షుడైతే 2019లో తమకు విజయం సునాయాసమని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఒక విధంగా మైండ్ గేమ్ కావచ్చు. ప్రత్యర్థుల స్థయిర్యాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి ఎత్తుగడలు రాజకీయంగా సర్వ సాధారణం. ఇప్పటికైనా పరివర్తన కోసం యువనేత ప్రయత్నించకపోవడం తమ పార్టీకి దెబ్బ అని కాంగ్రెస్ నేతలే ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో అయినా ఒక సిసలైన రాజకీయ నాయకుడిగా ఆయన రూపాంతరం చెందక పోతే పార్టీ ఇంతే సంగతులంటున్నారు. బీజేపీ నాయకులైతే తమకు మరింత మంచి రోజులు వచ్చినట్టేనని సంబరపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలను సవాలుగా తీసుకుని ఒక సమర్థ నేతగా మారుతారో, లేక ఇలాగే జోకులు వేసేవాళ్లకు అలుసైపోతారో, రాహుల్ గాంధీయే తేల్చుకోవాలి.