ఛత్తీస్ ఘర్ రాష్ట్ర కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్పడింది. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత అజిత్ జోగి ఈ నెల 6న వేరుకుంపటి పెట్టుకోవడానికి సిద్దం అవుతున్నారు. కానీ అందుకు ఆయన చెపుతున్న కారణం, చేస్తున్న ఆరోపణలు రెండూ నమ్మశక్యంగా లేవు. “కాంగ్రెస్ పార్టీ రెండవ భాజపా పార్టీలాగ తయారయింది. అందుకే రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేకపోతోంది. ఇప్పటికే రమణ్ సింగ్ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా అధికారం చెలాయిస్తున్నారు. ఇప్పటికైనా ఆయనని గట్టిగా అడ్డుకోలేకపోతే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా మాయం అయిపోతుంది. కాంగ్రెస్ అధిష్టానానికి ఈసంగతి తెలిసి ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోవడం లేదు. పార్టీ తీరుతో రోజురోజుకి నాపై కార్యకర్తల ఒత్తిడి పెరిగిపోతోంది. సుమారు 15,000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫోన్ ద్వారా, నేరుగా వచ్చి నన్ను కలిసి ఈ సమస్య గురించి నాతో మాట్లాడారు. తక్షణమే ఏదో ఒకటి చేయాలని నాపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. అందుకే నేనే స్వయంగా రంగంలో దిగి కొత్తగా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాను. జూన్ 6న నా స్వస్థలమైన మర్వాహికి వెళ్తాను. ఆ రోజు నా ముఖ్య అనుచరులు 5,000 మంది అక్కడికి వస్తారు. వాళ్ళతో నేను చర్చించి కొత్త పార్టీ స్థాపించడంపై తుది నిర్ణయం తీసుకొంటాను,” అని మీడియాకి తెలిపారు.
అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే, 2014లో జరిగిన ఉపఎన్నికలలో ఆయన కుమారుడు అమిత్ జోగి భాజపాతో చేతులు కలిపి కాంగ్రెస్ అభ్యర్ధి ఓటమికి కారకుడయ్యాడనే కారణం చేత కాంగ్రెస్ పార్టీ అమిత్ జోగిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి అజిత్ జోగి కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంతో పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడే భాజపాతో చేతులు కలిపి కాంగ్రెస్ అభ్యర్ధి ఓటమికి కారణం అయితే, రాష్ట్రంలో భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరాడటం లేదని ఆరోపించడం చాలా విచిత్రంగా ఉంది. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వంతో పోరాడవలసిన బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీదే. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ నేతగా అది ఆయన బాధ్యతే గానీ కాంగ్రెస్ అధిష్టానానిది కాదని అందరికీ తెలుసు. ఆయన తను చేయవలసిన పని చేయకుండా, తిరిగి తన పార్టీ అధిష్టానాన్ని నిందిస్తూ వేరు కుంపటి పెట్టుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడలేదని భావిస్తున్న అనేకమంది నేతలు వేరే పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. కానీ ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో భాజపాకి బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో అజిత్ జోగి వంటి కాంగ్రెస్ నేతలకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆయన ధైర్యం చేసి స్వంత పార్టీ పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నట్లున్నారు. దాని వలన ఇప్పటికే పూర్తిగా దెబ్బతిని ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ చీలిక కారణంగా ఇక ఎప్పటికీ కోలుకోలేదు.