ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న ద్వేషం గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబుని ద్వేషించడమే వైకాపా మ్యానిఫెస్టోలో ప్రధాన అంశంగా మారిపోయింది. అదే వైకాపా విధానంగా ఉంటోంది. జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలందరూ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొనే నిత్యం విమర్శలు గుప్పిస్తుంటారు. వారిలో సీనియర్ నేతలు కొంత మంది చాలా ఆచితూచి విమర్శలు చేస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆవేశంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అనుచిత పదాలు ప్రయోగిస్తుంటారు. అది ఏ స్థాయికి చేరిందంటే “ఈసారి ముఖ్యమంత్రి కనబడితే ప్రజలు ఆయనని చెప్పులతో కొట్టాలని” అనగలిగేంత. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పట్ల బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆవిధంగా అనుచితమైన పదాలు వాడటాన్ని ఎవరూ హర్షించలేరు.
జగన్మోహన్ రెడ్డి నిన్న అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్ద వడుగూరు, యాడికి మండలాల్లో రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ నవనిర్మాణ దీక్షల పేరిట చంద్రబాబు నాయుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని అందరి చేత శపధాలు చేయించడాన్ని ప్రశ్నించారు. “ఒకవైపు రాష్ట్రాన్ని దోచుకొంటూ, అవినీతి సంపాదనతో మా పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికీ రూ.40 కోట్లు పెట్టి కొంటూ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుదామని అందరి చేత ఆయనే శపధాలు చేయించడం ప్రజలను అవహేళన చేయడమే. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కోసం పంట రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ బృతి వంటి అనేక హామీలు ఇచ్చి ప్రజలను దారుణంగా మోసం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించే ప్రయత్నం చేయకుండా దానిపై కూడా రోజుకొకలాగా మాట్లాడుతున్నారు. ప్రజలని ఇంత దారుణంగా మోసం చేస్తున్న ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదు. ఈసారి ఆయన కనబడితే ప్రజలు ఆయనని చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పాలి,” అని జగన్ అన్నారు.
చంద్రబాబుపై ఓటుకి నోటు తదితర అంశాలపై జగన్ చాలా విమర్శలు చేశారు. అవన్నీ నిత్యం వింటున్నవే కనుక మళ్ళీ వాటి గురించి చెప్పుకోనవసరం లేదు. కానీ ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టమని ప్రజలను రెచ్చగొట్టడం, ఆయన ఒక దొంగ వంటి పదాలు వాడటం సబబు కాదు. రాజకీయాలలో ఉన్నవారు విమర్శలు చేసుకోవడం సహజమే కానీ అవి హద్దులలో ఉన్నంత వరకే ఎవరరూ అభ్యంతరం చెప్పరు. ఆవేశం, ద్వేషంతో హద్దులు మీరి మాట్లాడితే దానిని ప్రజలు కూడా ఆమోదించరు. పైగా అది ఊహించని సమస్యలని ఆహ్వానించినట్లే అవుతుంది. వైకాపా ఎమ్మెల్యేలు ఈశ్వరి, రోజాలకు ఎదురైనా చేదు అనుభవాలే అందుకు చక్కటి ఉదాహరణలు.