రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రభుత్వం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ళ గురించి అందరికీ తెలిసిందే. ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదనే ఉంది. విభజన కారణంగా వచ్చి పడిన సమస్యలని ఆయన మెల్లగా పరిష్కరించుకొని వస్తున్నారు. కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రధాన సమస్యగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఆ సమస్యను మాత్రం చంద్రబాబు నాయుడు ఎప్పటికీ పరిష్కరించుకోలేరేమో? ఆయన ప్రభుత్వం ఏపని చేసినా అందులో అవినీతి జరిగిపోతోందని, ఏపని చేయకపోతే ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోందని జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తుంటారు. అవినీతికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష చేయడాన్ని జగన్ తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణాలో కూడా ప్రతిపక్షాలున్నాయి. అవి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉంటాయి. కానీ తెరాస ధాటికి అవి నిలబడలేకపోతున్నాయి. ప్రతిపక్షాలు చేసే ప్రతీ విమర్శని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సమర్ధంగా తిప్పి కొడుతుంటారు. వాటికి ఆయన చెప్పే సమాధానం, దానిలో కనబడే తెగువ, నిజాయితీ కారణంగా ప్రతిపక్షాల విమర్శలు గాలికి ఎగిరిపోతుంటాయి. వాటి విమర్శలను ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వలన చివరికి వాళ్లకి కంఠశోషే మిగులుతోంది.
కానీ ఆంధ్రాలో జగన్ చేస్తున్న విమర్శలకు, సందిస్తున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జవాబు చెప్పుకోలేక ఇబ్బందిపడుతున్నారు. ఉదాహరణకి ఓటుకి నోటు కేసు గురించి జగన్ మాట్లాడితే, తెదేపా నేతలెవరూ ఆ ఊసే ఎత్తకుండా ఎదురుదాడి చేస్తుంటారు. అలాగే వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి, వారి రాజీనామాల గురించి జగన్ అడిగిన ప్రశ్నలకు తెదేపా జవాబు చెప్పదు. ఇటువంటివి చాలానే ఉన్నాయి కానీ వాటికి తెదేపా వద్ద సమాధానాలు లేవు కనుక జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కలో బల్లెంలాగ తయారయ్యారని చెప్పవచ్చు. జగన్ తమ ప్రభుత్వం ఎంతగా విరుచుకుపడుతున్నప్పటికీ తెదేపా ఏమీ చేయలేకపోతోంది. బహుశః తగిన సమయం కోసం ఓపికగా వేచి చూస్తోందేమో?
తెదేపా బలహీనతలేమిటో దానికీ తెలుసు.. జగన్మోహన్ రెడ్డితో సహా అందరికీ తెలుసు. కనుక అది ఆ బలహీనతలని అధిగమించలేనంత కాలం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కూడా కష్టమే. కానీ ఆ బలహీనతలని అధిగమించడం సాధ్యం అయ్యే విషయం కాదు కనుక జగన్మోహన్ రెడ్డికి లోకువకాక తప్పదు.