దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకి నోటు కేసులో ముద్దాయిగా పేర్కొనబడిన జెరూసలేం మత్తయ్యపై కేసుని హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనపై అక్రమంగా కేసు బనాయించారని మత్తయ్య హైకోర్టుకి తెలిపారు. ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న తరువాత హైకోర్టు ఆయనపై పెట్టిన కేసును కొట్టివేయడంతో క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఇది తెలంగాణా ప్రభుత్వానికి, ఆయనపై కేసు నమోదు చేసిన ఏ.సి.బి.కి ఎదురుదెబ్బగా భావించవచ్చు. ఎందుకంటే ఈ కేసులో నిందితులు ఎవరూ కూడా తప్పించుకోలేని విధంగా మొదటి నుంచే చాలా పకడ్బందీగా పధకం ప్రకారం ముందుకు సాగారు. కానీ అందరికీ తెలిసిన కారణాల వలన ఈ కేసు విచారణ ఇంకా మొదలవనేలేదు. మళ్ళీ ఎప్పటికైనా మొదలవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితిలో ఈ కేసు నుంచి ఒక ముద్దాయి క్లీన్ చిట్ పొంది బయటపడటం తెలంగాణా ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరమే. చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై ఆ కేసుని ఆటకెక్కించేశారని ఇప్పటికే కాంగ్రెస్, వామ పక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ కేసుకి భయపడే చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి దాసోహం అయిపోయారని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. కనుక మళ్ళీ అందరూ విమర్శించక మానరు.