అందాల నటిగా బాలీవుడ్ లో తారాపథంలోకి దూసుకుపోయిన శిల్పా షెట్టి, పెళ్లయ్యాక ఇల్లు, వ్యాపారం మీదే దృష్టి పెట్టింది. భర్త రాజ్ కుంద్రాతో పాటు ఇల్లే లోకం అనుకుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందట. రాజ్ కుంద్రాతో ఆమె సంబంధాలు అంత బాగా లేవని బాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ జంట విడాకుల బాట పట్టవచ్చని బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది.
శిల్పా భర్త రాజ్ కుంద్రా గత 15 రోజులుగా ఇంటికి రావడం లేదట. చాలా కాలంగా భార్యాభర్తలు ఎడమొహం పెడమొహమగా ఉంటున్నారట. రెండు మూడు రోజులకోసారి ఉతికిన డ్రెస్ కోసం మాత్రమే రాజ్ ఇంటికి వెళ్తున్నాడట.
ఏడేళ్ల క్రితం మూడుముళ్లు ఏడడుగులతో శిల్పా, రాజ్ దంపతులయ్యారు. ఈ జంటకు ఓ కుమారుడున్నాడు. ముంబైలో ఎక్కువ సందడి చేసే జంటల్లో ఒకటిగా వీరు పేరు తెచ్చుకున్నారు. 1993లో బాజీగర్ సినిమాలో రెండో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శిల్పా, అందమైన హీరోయిన్ గా ప్రాచుర్యం పొందింది. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. యోగా అంటే శిల్పకు ప్రాణం. ఆమె యోగా వీడియో చాలా పాపులర్ అయింది. అందమైన శిల్పాషెట్టి యోగాసనాలు వేసే వీడియో బెస్ట్ సెల్లర్ గా పేరు పొందింది.
ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు శిల్పా, రాజ్ సహ యజమానులుగా వ్యవహరించారు. తొలిసీజన్ టైటిల్ గెల్చుకున్న ఈ జట్టు ఆ తర్వాత వివాదాల్లో కూరుకుపోయింది. బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఇమేజి మసకబారింది. చివరకు రెండేళ్లపాటు నిషేధానికి గురైంది. ఆ తర్వాత ఏమైందో ఏమో దంపతుల మధ్య పొరపొచ్చాలు వచ్చాయనేది బీటౌన్ టాక్.
మొత్తానికి త్వరలోనే వీరిద్దరూ విడిపోయే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా కథనం. అపార్థాలు తొలగిపోయి, వీరు సాఫీగా సహజీవనం సాగిస్తే బాగుండని శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.