తెలుగులో ఎన్ని సినిమాలొచ్చినా, అందులో హిట్లు ఉన్నా.. తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవడంలో విఫలమైంది అంజలి. ఆఖరికి సరైనోడులో.. ఐటెమ్ పాటలో చిందేసినా, ఆ హిట్టులో వాటా కూడా అందుకోలేకపోయింది. కథానాయికగా రాజోలు పాప కెరీర్ మరీ డల్లుగా ఉంది. ఐటెమ్ పాటలూ ఇచ్చేవాళ్లు లేరు. మరి కెరీర్ని ఎలా నిలబెట్టుకోవాలి? అన్న దీర్ఘాలోచనలో పడిపోయిందట అంజలి. గత కొన్నాళ్లుగా స్లిమ్ అవ్వాలని అంజలి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఫలితం రాలేదు. ఇప్పుడు మళ్లీ ఒళ్లు తగ్గించుకోవడానికి జిమ్ములో చేరిందట. అక్కడ పగలనక రాత్రనక వర్కవుట్లు చేస్తోందట అంజలి.కానీ… బరువు మాత్రం తగ్గలేకపోతోందట. ”నేను భోజన ప్రియురాల్ని. అందుకే ఎన్ని కసరత్తులుచేసినా.. దానికి తగినట్టు తినేస్తున్నా. అందుకే ప్రభావం కనిపించడం లేదు..” అంటోంది అంజలి. ఆ తిండి యావ ఏదో తగ్గించుకొని.. కాస్త స్లిమ్ అయితే అవకాశాలు వస్తాయి కదా??
ఈ మాటంటే అంజలి ఒప్పుకోదు. స్లిమ్ అవ్వాలని అందరికీ ఉంటుందని, కానీ.. ఒకొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుందని.. క్లాస్ పీకుతోంది. అవకాశాలు తగ్గాయన్న బెంగ తనకు ఎప్పుడూ లేదని, తన కెరీర్లో ఒకేసారి నాలుగైదు సినిమాలుచేసిన దాఖలాలు లేవని, ఇలా నిదానంగా ప్రయాణంచేయడమే తనకిష్టమని చెప్పుకొచ్చింది. అందని ద్రాక్ష పళ్లు పుల్లన అంటారు.. అంజలి మాట వింటే ఆ సామెతే గుర్తొస్తుంది కదూ.