ఇటీవల తిరుపతిలో జరిగిన మహానాడు సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెదేపాని జాతీయ పార్టీగా మలుస్తానని, జాతీయ రాజకీయాలలో తెదేపా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. భాజపా, తెదేపాల మధ్య సంబంధాలు అంత గొప్పగా లేవు కనుక ఒకవేళ వచ్చే ఎన్నికలనాటికి తెగతెంపులు చేసుకొన్నట్లయితే, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లేదా మరొకరి నేతృత్వంలో సిద్దం అయ్యే మూడవ కూటమితో చేతులు కలిపే ఉద్దేశ్యంతోనే ఆయన ఆవిధంగా చెప్పి ఉండవచ్చు. కానీ ఆయన ఎకనామిక్ టైమ్స్ పత్రికకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అందుకు పూర్తి భిన్నంగా చెప్పారు. తనకు జాతీయ స్థాయి రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని, విభజన కారణంగా దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడానికే తను ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ‘జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది కనుక భాజపాకి ప్రత్యామ్నాయంగా మూడవ కూటమి అవసరం ఉందా?’ అనే ప్రశ్నకు జవాబుగా “మోడీ ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోకి విదేశీ పెట్టుబడులు బాగా పెరిగాయి. దేశంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. కనుక నా ఉద్దేశ్యంలో మూడవ కూటమి అవసరంలేదు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు నాయుడు మహానాడులో ఆవిధంగా చెప్పి మళ్ళీ ఇంతలోనే ఇలాగ మాట్లాడటం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః మహానాడులో చెప్పిన ఆ మాటలు భాజపా అధిష్టానానికి, ప్రధాని నరేంద్ర మోడీకి హెచ్చరికగా చెప్పి ఉండవచ్చు లేదా ఆ విధంగా ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని, దాని వలన కేంద్రానికి తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందనే ఆలోచనతోనే మళ్ళీ ఈవిధంగా మాట మార్చారేమో? కానీ ఒకవేళ రాష్ట్రంలో తెదేపా,భాజపాలు తెగతెంపులు చేసుకొన్నట్లయితే, చంద్రబాబు నాయుడు మూడవ కూటమితో చేతులు కలపడం తధ్యం. కేంద్రంలో మళ్ళీ ఎన్డీయే లేదా యూపియే కూటమి అధికారంలోకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం కూడా ఖాయమనే చెప్పవచ్చు. ఆయన జాతీయ స్థాయి రాజకీయాలలో వేలుపెట్టకుండా ఉండాలంటే, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల హాయసహకారాలు అందించాలని సూచిస్తున్నారనుకోవచ్చు. కనుక ఆయన బంతి భాజపా కోర్టులో పడేసినట్లే భావించవచ్చు.