వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్ర నేటితో 4వ రోజుకి చేరింది. ఇవ్వాళ్ళ ఆయన కదిరి నియోజకవర్గంలో ఎన్.పి.కుంట గ్రామంలో భరోసా యాత్ర నిర్వహిస్తూ, మళ్ళీ యధాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. “జిల్లాలో పేదల భూములను చంద్రబాబు నాయుడు తన అత్తగారి సొత్తన్నట్లు గుంజుకొని సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేందుకు ఇచ్చేశారు. ఆ ప్లాంటులో నిర్వాసితులు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి రైతులకు భూములు ఇస్తే చంద్రబాబు నాయుడు వాటిని గుంజుకొంటున్నారు. కనీసం
వారికి నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదు. ఆయనకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా?” అని జగన్ ప్రశ్నించారు. ఇంకా చాలా విషయాలు ప్రస్తావించి ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురించి జగన్ అనుచితంగా మాట్లాడుతున్నందుకు తెదేపా మంత్రులు, నేతలు కూడా పోటీపడి ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఒకరు
జగన్ కి మానసిక స్థితి సరిగా లేదు తక్షణమే వైద్యుడికి చూపించుకోమంటారు. మరొకరు జగన్మోహన్ రెడ్డినే ప్రజలు పళ్ళు రాలగొడతారని అంటారు. ఇంకొకరు నిన్ను భరించలేకపోతున్నాము..మళ్ళీ జైలుకి వెళ్ళిపో అంటారు. మరొకరు విజయమ్మ ఆయనకి చిన్నప్పుడు ఉగ్గు పాలుకి బదులు జిల్లేడు పాలు పోసి పెంచారు కనుకనే ఆయన అలాగ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి జగన్ అనుచితంగా మట్లాడటం ఎంత
తప్పో, ప్రతిపక్ష నేత గురించి అధికార పార్టీ నేతలు అనుచితంగా మాట్లాడటం కూడా అంతే తప్పు. ఇరు వర్గాలు ప్రజా సమస్యలు, వాటి పరిష్కారాల గురించి మాట్లాడి ఉంటే ప్రజలు కూడా హర్షించేవారు. కానీ ఆ సమస్యలని అడ్డుపెట్టుకొని ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ రెండు పార్టీల నేతలు రైతుల ఆత్మహత్యలు నివారించడం గురించి అసలు మాట్లాడకుండా ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం గమనిస్తే వారికి రైతుల సమస్యలను పరిష్కరించాలనే తపన కంటే ఒకరినొకరు ప్రజల ముందు దోషిగా నిలబెట్టుకోవాలనే తపనే ఎక్కువగా ఉన్నట్లు కనబడుతోంది. ఒకరి గురించి మరొకరు చులకనగా మాట్లాడుకోవడం వలన చివరికి అందరూ ప్రజల దృష్టిలో చులకన అవుతారని గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.