సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన స్వంత పార్టీ నేతలపైనే చాలా తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. “గాంధీ భవన్ లో కూర్చొని ప్రెస్ మీటలు పెడితే జనాలు పట్టించుకోరు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యల గురించి ప్రభుత్వంతో పోరాడ గలిగినవారికే ప్రజలు ఓట్లు వేస్తారు. టీ-కాంగ్రెస్ నేతలలో కనీసం 20మంది తామే ముఖ్యమంత్రి అభ్యర్దులమని అనుకొంటూ ఉంటారు. కానీ పార్టీని కాపాడుకోవడానికి, బలోపేతం చేసుకోవడానికి ఎవరూ ప్రయత్నించరు,” అని విమర్శించారు. “మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అసమర్ధత వలన 2014 ఎన్నికలలో
పార్టీ ఓడిపోతే, ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వలన ప్రతీ ఎన్నికలలోనూ పార్టీ ఓడిపోతోంది. ఇద్దరూ అసమర్దులే. ఒకవేళ నేనే పిసిసి అధ్యక్షుడినయితే పాలేరు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేదే కాదు. ఓడిపోయుంటే నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేసి ఉండేవాడిని. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీని నడిపించడం రాదు కానీ గ్రూప్ రాజకీయాలు
చేతనవుతాయి. ఆయన చేసిన రాజకీయాల కారణంగానే నా సోదరుడు రాజగోపాల్ రెడ్డి భువనగిరిలో ఓడిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఆ పదవిని పట్టుకొని వేలాడుతున్నాడు. ఇటువంటి నాయకులని పెట్టుకొని ముందుకు సాగలేము. పార్టీకి
సర్జరీ చేసి బాగుచేసుకోవాలి లేకుంటే ఆనక పోస్ట్ మారటం చేసుకోవలసి వస్తుంది. వచ్చే ఎన్నికలకి ఇప్పటి నుంచే పార్టీ సిద్దం అవ్వాలంటే ముందాపని చేయాలి. తరువాత ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో ఇప్పుడే ప్రకటిస్తే మంచిది. తెలంగాణా కోసం పోరాడిన వ్యక్తికే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలి. నేను పార్టీ పరిస్థితుల గురించి వివరిస్తూ సోనియా గాంధీకి ఒక లేఖ
వ్రాస్తాను,” అని మీడియాతో అన్నారు. ఆంధ్రాలో డా. రవీంద్రనాథ్ రెడ్డి ఏవిధంగా ఎప్పుడూ అసంతృప్తితో బాధపడుతుంటారో, తెలంగాణాలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి అదేవిధంగా బాధపడుతుంటారు. పార్టీలో కనీసం 20మంది ముఖ్యమంత్రి అభ్యర్దులమని భావిస్తుంటారనే ఆయన మాట నిజం. వారిలో ఆయన కూడా ఒకరు. ఇప్పుడు ఆ అవకాశం
లేదు కనుక కనీసం పిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లున్నారు. ఆయన మాటలలోనే అది స్పష్టం అవుతోంది. పార్టీలో చాలా సీనియర్ నేత అయిన తను ఆ పదవికి అన్ని విధాల అర్హుడనని భావిస్తున్నందున, ఆ పదవి దక్కక పోవడంతో
తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్లు ఆయ మాటలలో కనబడుతోంది. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు కనుక, తెలంగాణా కోసం పోరాడటాన్ని పిసిసి పదవికి ఒక అర్హతగా నిర్నయిస్తున్నట్లున్నారు. కాంగ్రెస్ నేతలలో పదవి, అధికారం లేకుండా ఎక్కువ కాలం జీవించలేరని కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాటలు నిరూపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నేతలే ఓడించుకొంటారనే సంగతి రాజగోపాల్ రెడ్డి ఓటమితో రుజువయింది. ఈ అసంతృప్తి కారణంగానే కోమటిరెడ్డి వెంకట రెడ్డి త్వరలో తెరాసలో చేరడానికి సిద్దం అవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉంటాను లేకుంటే తెరాసలోకి
వెళ్ళిపోతానని సోనియా గాంధీకి తెలియజేసేందుకే లేఖ వ్రాసి ఉంటారు. అటువంటి పదవి ఆశించేవారు పార్టీలో నేతలందరినీ కలుపుకొని పోగల నేర్పు, ఓర్పు కలిగిఉండాలి. కానీ పార్టీలో తను తప్ప మిగిలిన వాళ్ళు అందరూ పనికిమాలిన వాళ్ళే అన్నట్లుగా మాట్లాడుతూ, ఎవరితో కలవలేని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎట్టి పరిస్థితులలో కూడా పిసిసి అధ్యక్ష పదవి రాదని చెప్పవచ్చు. కనుక ఆయన నేడోరేపో తెరాసలోకి వెళ్ళిపోవడం ఖాయం. బహుశః అందుకే టీ-కాంగ్రెస్ నేతలందరినీ పేరుపేరునా విమర్శిస్తున్నట్లున్నారు. కాంగ్రెస్ పార్టీ వంటి పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఉన్న పార్టీలోనే ఇమడలేని కోమటిరెడ్డి వెంకట రెడ్డి, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కనుసన్నలలో నడుస్తున్న తెరాసలో చేరినా ఇమడలేరు. కనుక ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉండటమే అన్ని విధాల మంచిది.