జాతీయ జెండాను ఎవరు రూపొందించారంటే ‘మా పింగళి వెంకయ్య’ అని గర్వంగా చెప్పుకొంటాము. కానీ మానవ రూపంలో రాక్షసులని చెప్పుకోదగ్గ ఐసిస్ ఉగ్రవాదుల జెండాని ఒక భారతీయుడు రూపొందించాడని తెలిసి ప్రపంచదేశాల ముందు భారత్ సిగ్గుతో తలవంచుకోవలసిన పరిస్థితి కలిగింది నేడు. చెన్నైకి చెందిన మొహమ్మద్ నజీర్ అనే ఇంజనీరింగ్ విద్యార్ధి ఆ జెండాను, లోగోను రూపొందించాడుట! ఆ విషయం అతని తండ్రి ఆమీర్ మొహమ్మద్ స్వయంగా పోలీసులకు తెలియజేశారు.
దుబాయ్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకొంటూ కుటుంబాన్ని పోషించుకొంటున్న అమీర్ మొహమ్మద్ తన కొడుకు సూడాన్ మీదుగా సిరియా వెళ్లి ఐసిస్ సంస్థలో చేరేందుకు వెళుతున్నట్లు తెలుసుకొని తక్షణమే భారత్ వచ్చి పోలీసులకు తన కొడుకుపై పిర్యాదు చేశారు. అప్పుడు సూడాన్ పోలీసులు అతనిని అరెస్ట్ చేసి భారత్ త్రిప్పి పంపారు. ఆ తరువాత అతను 2014లో దుబాయి వెళ్లి అక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో వెబ్ డిజైనర్ గా పనిచేశాడు. అక్కడి నుంచే సిరియా వెళ్ళిపోయి ఐసిస్ ఉగ్రవాదులలో చేరిపోయాడు.
అది చూసి సహించలేక అమీర్ మొహమ్మద్ తనకి కొడుకు నుంచి అందిన ఈ-మెయిల్స్, వాట్స్ అప్ మెసేజ్ లు అన్నిటినీ పోలీసులకు అందించారు. వాటి ఆధారంగా జాతీయ దర్యాప్తు బృందం అధికారులు నిన్న మొహమ్మద్ నజీర్ పై సెక్షన్ 164 క్రింద కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రధాన సాక్షి అతని తండ్రే కావడం విశేషం. తండ్రి దేశాన్ని ప్రేమిస్తుంటే కొడుకు దేశానికి శత్రువుగా మారడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే అతను ఐసిస్ ఉగ్రవాదులలో చేరిపోయిన తరువాత ఇక అతనిపై కేసు నమోదు చేసినా అతనిని పట్టుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదు. కానీ అతను దేశంలో ఇంకా ఎవరెవరితో టచ్ లో ఉండేవాడు? ఇంకా ఎంతమంది అటువంటి ఐసిస్ సానుభూతిపరులు దేశంలో ఉన్నారు? అనే వివరాలు కనుగొనేందుకు ఉపయోగపడవచ్చు. అతను రాజస్థాన్ లోని జైపూర్ లో గల ఇండియన్ ఆయిల్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న సిరాజుద్దీన్ అనే వ్యక్తితో సంప్రదింపులు జరిపేవాడని నిఘా సంస్థలు కనుగొన్నాయి. అతనిని ఇదివరకే అదుపులో తీసుకొన్నారు. అతనిపై కూడా రేపు చార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. ఐసిస్ ఉగ్రవాదంపై ఉన్నత విద్యావంతులైన ముస్లిం యువకులు ఆకర్షితులవడం ఈ మద్యకాలంలో చాలా పెరిగింది. కొన్ని రోజుల క్రితం ఐసిస్ సంస్థ విడుదల చేసిన ఒక వీడియో క్లిప్పింగులో ఆంధ్రాకి చెందిన యువకుడు కూడా ఒకడున్నట్లు నిఘా సంస్థ అధికారులు గుర్తించారు. మన దేశం నుండి సుమారు 500 మంది యువకులు ఐసిస్ సంస్థలో చేరినట్లు సమాచారం. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే.