కొణతాల రామకృష్ణ రెండేళ్ళ క్రితం వైకాపా నుంచి బయటకి వచ్చేశారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఎవరూ ఊహించని విధంగా పావులు కదుపుతున్నారు. మొదట ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ వ్రాశారు. ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నిటినీ అమలుచేయాలని, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధికి సహాయం చేయలాని తన లేఖలో కోరారు. ఆ తరువాత ఉత్తరాంధ్రా జిల్లాలలో పెండింగ్ ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ వ్రాసి వాటిని వీలయినంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. తాజాగా ఆయన రాష్ట్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖకి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లకి సమాచార హక్కు చట్టం క్రింద వేర్వేరుగా దరఖాస్తులు చేసుకొన్నారు. ఇంతవరకు ఆ మూడు జిల్లాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఎంత డబ్బు విడుదల చేసింది? దానిని దేనికోసం ఎంత ఖర్చు పెట్టారు? వగైరా వివరాలు కావాలని కోరారు.
ఆయన ఆ వివరాలు ఎందుకు కోరుతున్నారో తెలియదు కానీ ఏదో చాలా పెద్ద వ్యూహంతోనే పావులు కదుపుతునట్లున్నారు. ఒకవేళ ఆయన తెదేపాలో చేరే ఉద్దేశ్యం ఉంటే ఆవిధంగా చేసి ఉండేవారు కాదు. ఆ లెక్కలలో ఏవైనా తేడాలు బయటపడితే దాని వలన తెదేపాకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కనుక ఆయన భాజపాలో చేరి తెదేపాని నిలదీయాలని ఆలోచిస్తున్నారా? అంటే ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ వ్రాసి ఇబ్బంది పెట్టకూడదు. కనుక ఆయన భాజపాలో కూడా చేరకపోవచ్చునని అనుకొంటే మరి ఆయన ఆ జామా ఖర్చుల లెక్కలు ఎందుకు సేకరిస్తునట్లు? అనే అనుమానం కలుగుతోంది. బహుశః త్వరలో ఆయనే ఈ సందేహం నివృతి చేస్తారేమో? చూడాలి.