కాగల కార్యం గంధర్వులు తీర్చారని సామెత. తెలంగాణలో బీజేపీ కోరుకున్న పనిని తెరాస చేసిపెడుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ఉండకుండా చేయాలని పంతం పట్టిన కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున తెరాసలో చేర్చుకున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పట్టించుకోకుండా తన పనిని పూర్తి చేశారు. దీంతో తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేల బలం 15 నుంచి మూడుకు పడిపోయింది.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను కూడా తెరాస టార్గెట్ చేసింది. వరసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది. రాష్ట్రంలో తనను గట్టిగా విమర్శించే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగింది. బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే బలమైన ప్రతిపక్షంగా కనిపిస్తున్నారు. ఏడుగురు సభ్యులున్న ఎం.ఐ.ఎం. ఎలాగూ తెరాసకు మిత్ర పక్షమే.
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలపడాలనేది బీజేపీ ప్లాన్. అధికారంలోకి వచ్చే స్థాయిలో బలాన్ని పెంచుకోవడానికి కష్టపడాలని పార్టీ శ్రేణులకు అమిత్ షా లక్ష్యం నిర్దేశించారు. అధికారంలోకి రాకపోయినా ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో బలపడ్డా గొప్ప విజయం కిందే లెక్క. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, తెరాసల మధ్య పొత్తు కుదురుతుందనే ఊహాగానాలు వినవస్తున్నాయి. అది నిజమో కాదో తెలియదు.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను నామమాత్రంగా చేయడానికి తెరాస ప్రయత్నించే కొద్దీ బీజేపీ బలపడటానికి మార్గం సుగమం చేసినట్టవుతుందని కొందరు పరశీలకుల విశ్లేషణ. తెలంగాణలో టీడీపీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ కూడా నామమాత్రమైతే అసలైన ప్రతిపక్షంగా ఏ పార్టీ ప్రజలకు కనిపిస్తుంది? కచ్చితంగా ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించే అవకాశం ఉంది.
తెరాస ప్రభుత్వ ఫీల్ గుడ్ హనీమూన్ ముగిసినట్టే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల సంబురాలు ఘనంగా చేసినా, అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా ప్రభుత్వంపై అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అని ఊరించడమే తప్ప, చేసింది ఏమీలేదు. సికింద్రాబాద్ లో ఒక్క కాలనీని కట్టి, దాన్నే చూపించి వరసగా అనేక ఎన్నికల్లో తెరాస లబ్ధి పొందింది. పక్కా ఇళ్లు వస్తాయనే ఆశతో ఓటేసిన గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రజలకు ప్రస్తుతానికి నిరాశే మిగిలింది. ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారో, అవి ఎవరికి మంజూరవుతాయో తెలియని పరిస్థితి. ఇదే తెరాస ప్రభుత్వానికి పెద్ద మైనస్ పాయింటుగా కనిపిస్తోంది.
ఇంకా అనేక విషయాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న వారికి దాన్ని ప్రదర్శించడానికి ఓ పార్టీ కావాలి. టీడీపీ, కాంగ్రెస్ బలహీనపడితే, అప్పుడు బీజేపీ బలంగా కనిపించవచ్చు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న వారు కమలం గుర్తుకు ఓటు వేయవచ్చు. అలా, అయాచిత వరంగా అదనపు ఓట్లు బీజేపీ ఖాతాలో జమయ్యే అవకాశం ఉందనేది పరిశీలకుల అంచనా. దాంతో పాటు, బీజేపీ కూడా బలం పెంచుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తుంది. మొత్తం మీద 2019 ఎన్నికల నాటికి బీజేపీ ఓ ప్రబల శక్తిగా ఎదిగితే, అది తెరాసకు ఏమేరకు చెక్ పెడుతుందనేదే ఆసక్తికరం.